గంజాయి దందాకు అడ్డాలుగా మారుతున్న ఓయో రూములు?

by Ratna Kumari |

గంజాయి అక్రమ రవాణాదారులు పోలీసుల కళ్లుగప్పి దందాను కొనసాగించేందుకు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నట్లు సమాచారం.

గంజాయి దందాకు అడ్డాలుగా మారుతున్న ఓయో రూములు?
X

దిశ, సిటీ క్రైమ్ : గంజాయి అక్రమ రవాణాదారులు పోలీసుల కళ్లుగప్పి దందాను కొనసాగించేందుకు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కొందరు ఓయో రూములను వినియోగిస్తున్నారనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు నిరంతరం చర్యలు చేపడుతున్న ఈగల్ (EAGLE) విభాగం, స్థానిక పోలీసులు ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈగల్ అధికారులకు అందిన ప్రాథమిక సమాచారంతో ఓయో రూములను వినియోగిస్తూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కొందరు స్మగ్లర్లు ఓయో రూములను బుక్ చేసుకుని, గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని అక్కడికి తరలించి హాష్ ఆయిల్ తయారీకి యత్నిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఓయో రూములపై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్న కొందరు వ్యక్తులను గుర్తించిన ఈగల్ అధికారులు, వారిని అదుపులోకి తీసుకునేందుకు గాలింపును ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇప్పటికే కొందరిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Next Story