బేగంబజార్‌లో భారీగా నకిలీ సిగరెట్లు పట్టివేత

by Ratna Kumari |

నగరంలోని గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున నకిలీ సిగరెట్ల విక్రయాలు సాగిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

బేగంబజార్‌లో భారీగా నకిలీ సిగరెట్లు పట్టివేత
X

దిశ, కార్వాన్ : నగరంలోని గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున నకిలీ సిగరెట్ల విక్రయాలు సాగిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ప్రముఖ బ్రాండ్ ‘గోల్డ్ ఫ్లేక్’ పేరుతో నకిలీ సిగరెట్లను విక్రయిస్తున్న ఓ వ్యాపారిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంబజార్‌లో మనీష్ కుమార్ అనే వ్యక్తి ‘మంగళం ట్రేడర్స్’ పేరుతో హోల్‌సేల్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే గోల్డ్ ఫ్లేక్ బ్రాండ్ పేరుతో నకిలీ సిగరెట్లను నగరంలోని పలు పాన్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన సంబంధిత కంపెనీ ప్రతినిధులు ‘ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’కు సమాచారం అందించారు. సమాచారం మేరకు ఖైరతాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు సంయుక్తంగా బేగంబజార్‌లోని మంగళం ట్రేడర్స్‌పై దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ.3 లక్షల విలువైన నకిలీ గోల్డ్ ఫ్లేక్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీజ్ చేసిన నకిలీ సిగరెట్లతో పాటు షాపు యజమాని మనీష్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం గోషామహల్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story