LA28 Olympics : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్-2028‌కు టీమిండియా క్వాలిఫై

by Harish |

లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు భారత మహిళల క్రికెట్ జట్టు అర్హత సాధించింది.

LA28 Olympics : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్-2028‌కు టీమిండియా క్వాలిఫై
X

దిశ, స్పోర్ట్స్ : 2028‌లో జరిగే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ తిరిగి రాబోతోంది. 128 ఏళ్ల తర్వాత విశ్వక్రీడల్లో క్రికెట్‌‌ను చూడబోతున్నాం. టీ20 ఫార్మాట్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో ఈవెంట్స్ జరగనున్నాయి. క్రికెట్ ఈవెంట్స్‌కు సంబంధించిన అర్హత ప్రమాణాలను ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) సోమవారం ప్రకటించింది. ఐసీసీ సిఫార్స్ చేసిన ప్రతిపాదనలకు ఐవోసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలిపింది. పురుషుల, మహిళల విభాగాల్లో ఆరేసి జట్లు పాల్గొంటాయి. అందులో ఒక్క బెర్త్ ఆతిథ్య దేశమైన అమెరికాకు కేటాయించారు. ఓషియానియా, యూరోప్, ఆసియా, అఫ్రికా ఖండాలకు నాలుగు బెర్త్‌లు ఉన్నాయి. మరో బెర్త్‌ను క్వాలిఫయర్ ద్వారా ఎంపిక చేస్తారు.

ఇండియా రైట్ రైట్

టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు గ్రూపు దశలోనే నిష్ర్కమించిన విషయం తెలిసిందే. ఆదివారం కీలక పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడటం సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. అయితే, ఈ టోర్నీలో పాల్గొనడం ద్వారా భారత జట్టు ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ప్రపంచకప్ ర్యాంక్‌ల ఆధారంగా భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు కూడా అర్హత సాధించాయి. ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా, ఆసియా నుంచి భారత్, యూరోప్ నుంచి ఇంగ్లాండ్, ఆఫ్రికా నుంచి సౌతాఫ్రికా టీమ్‌లు టాప్ ర్యాంక్‌లో ఉండటంతో తమ స్థానాలను ఖాయం చేసుకున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ సెమీస్‌కు చేరుకున్నప్పటికీ ఆ జట్టుకు బెర్త్ దక్కలేదు. కరేబియన్ జట్టు అనేది 13 దేశాల సమూహం. కాబట్టి, ఐవోసీ విండీస్‌ను నేషనల్ ఒలింపిక్ కమిటీగా గుర్తించలేదు. ఈ కారణంగా ఆ జట్టు నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదు. ఒకవేళ ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ఆ టీమ్ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-8లో ఉంటే ఐసీసీ ఒలింపిక్స్ క్వాలిఫయర్ ద్వారా అవకాశం ఉంటుంది. భారత పురుషుల జట్టుకు ఇంకా బెర్త్ ఖరారు కాలేదు. అయితే టీ20ల్లో నం.1 జట్టుగా ఉన్న టీమిండియాకు బెర్త్ ఖాయమే.

ఆతిథ్య జట్టుకు షరతులు వర్తిసాయి

ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న అమెరికాకు ఒక బెర్త్ కేటాయించినా విశ్వక్రీడల్లో ఆ జట్టు పాల్గొనడానికి షరతులు వర్తిస్తాయి. అమెరికా నేరుగా ఒలింపిక్స్‌లో పాల్గొనదు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అమెరికా టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-15లో స్థానం పొందాలి. అప్పుడు ఆ జట్టు ఆతిథ్య టీమ్ కోటాలో విశ్వక్రీడల్లో బరిలోకి దిగుతుంది.

క్వాలిఫయర్ ద్వారా ఆఖరి జట్టు

ఆరు జట్లలో ఒక్క జట్టు క్వాలిఫయర్స్ ద్వారా ఖరారు కానుంది. దీని కోసం ఫైనల్ ఒలింపిక్ గ్లోబల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. ఖండాల నుంచి అర్హత సాధించిన జట్లు కాకుండా టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-8లో నిలిచిన టీమ్‌లు ఈ క్వాలిఫయర్‌లో పాల్గొంటాయి. విజేతగా నిలిచిన జట్టు ఒలింపిక్స్‌ ఆడుతోంది. వచ్చే ఏడాది ఈ క్వాలిఫయర్ టోర్నీ ఉంటుంది. ఒకవేళ యూఎస్‌ఏ అర్హత సాధించకపోతే ర్యాంకింగ్స్‌లో మెరుగ్గా ఉన్న జట్టుకు(ఇంతకుముందు అర్హత సాధించని టీమ్) ఆటోమేటిక్ బెర్త్ దక్కుతుంది.

ఫార్మాట్ ఇలా..

పురుషుల, మహిళల టోర్నీల్లో మొత్తం 28 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆరు జట్లను మూడు టీమ్‌ల చొప్పున రెండు గ్రూపులు విభిస్తారు. గ్రూపులో ప్రతి జట్టు ఇతర జట్లతో ఆడిన తర్వాత మరో గ్రూపులోని రెండు జట్లతో ఆడుతుంది. అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు గోల్డ్ మెడల్ కోసం తలపడతాయి. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న టీమ్‌లు కాంస్య పతకం కోసం పోటీపడతాయి.


Next Story