- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Apple: సీసీఐ దర్యాప్తుపై యాపిల్ తీవ్ర అభ్యంతరం
2024లో సీసీఐ దర్యాప్తు బృందం, ఐఓఎస్ యాప్ స్టోర్‌పై యాపిల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందని, డెవలపర్లను తమ చెల్లింపు వ్యవస్థనే ఉపయోగించాల్సిందిగా ఒత్తిడి తెచ్చిందని తేల్చింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) దర్యాప్తుపై గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమపై వచ్చిన యాంటీట్రస్ట్ ఆరోపణలను పరిశీలించడంలో సీసీఐ అధికారులు స్వతంత్రంగా దర్యాప్తు చేయలేదని, తమ ప్రత్యర్థి కంపెనీల ఆరోపణలను యథాతథంగా 'కాపీ-పేస్ట్' చేసి నివేదిక రూపొందించారని ఆరోపించింది. 2024లో సీసీఐ దర్యాప్తు బృందం, ఐఓఎస్ యాప్ స్టోర్‌పై యాపిల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందని, డెవలపర్లను తమ చెల్లింపు వ్యవస్థనే ఉపయోగించాల్సిందిగా ఒత్తిడి తెచ్చిందని తేల్చింది. యాపిల్ తన యాప్ స్టోర్ ద్వారా జరిగే ప్రతి డిజిటల్ కొనుగోలుపై డెవలపర్ల నుంచి ఏకంగా 15-30 శాతం వరకు భారీ కమీషన్ వసూలు చేస్తోంది. ఇతర ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాలను అనుమతించకుండా, యాపిల్ ఇన్-యాప్ పేమెంట్ సిస్టమ్‌నే వాడాలని ఒత్తిడి తెచ్చి గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందనేది ఆరోపణలు. అయితే భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తమ వాటా 6 శాతం కంటే తక్కువేనని, అలాంటి పరిస్థితిలో తమపై ఏకపక్షంగా చర్యలు తీసుకోవడం సరికాదని యాపిల్ వాదిస్తోంది. తమ బిజినెస్ మోడల్‌లో బలవంతపు మార్పులు చేస్తే పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని కూడా కంపెనీ హెచ్చరించింది. తాజాగా సీసీఐకి సమర్పించిన తన వివరణలో యాపిల్.. మ్యాచ్ గ్రూప్, ఫోన్‌పే, పేటీఎం వంటి సంస్థల వాదనలను దర్యాప్తు అధికారులు స్వతంత్రంగా పరిశీలించలేదని పేర్కొంది. అంతేకాకుండా, యూరోపియన్ యూనియన్ తీర్పులోని కొన్ని అంశాలను కూడా భారత దర్యాప్తు నివేదికలో గుడ్డిగా ఉపయోగించారని ఆరోపించింది. కాగా, ఈ కేసుపై జూలై 21న సీసీఐ అన్ని పక్షాలతో కీలక విచారణ నిర్వహించనుంది.






