దౌలత్‌నగర్‌లో భూకబ్జా ఆరోపణలు.. రైతుకు ప్రాణహాని బెదిరింపులు?

by Kodari Anjali |

పర్వతగిరి మండలం దౌలత్‌నగర్ గ్రామానికి చెందిన రైతు చీమల అయిలయ్య తనకు వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల వ్యవసాయ భూమిని అక్రమంగా ఇతరుల పేరుపై పట్టా చేసి విక్రయించారని ఆరోపించారు.

దౌలత్‌నగర్‌లో భూకబ్జా ఆరోపణలు.. రైతుకు ప్రాణహాని బెదిరింపులు?
X

దిశ, పర్వతగిరి: పర్వతగిరి మండలం దౌలత్‌నగర్ గ్రామానికి చెందిన రైతు చీమల అయిలయ్య తనకు వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల వ్యవసాయ భూమిని అక్రమంగా ఇతరుల పేరుపై పట్టా చేసి విక్రయించారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన వరంగల్ జిల్లా ప్రజావాణి గ్రీవెన్స్‌లో, పర్వతగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రైతు అయిలయ్య తెలిపిన వివరాల ప్రకారం, దౌలత్‌నగర్ గ్రామ పరిధిలోని సర్వే నెం.419లో ఉన్న 3 ఎకరాల భూమిని గత 50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ వస్తున్నానని పేర్కొన్నారు. అయితే అదే గ్రామానికి చెందిన చీమల బిక్షపతి తన కుటుంబ సభ్యుల పేర్లను ఉపయోగించి రెవెన్యూ అధికారుల సహకారంతో అక్రమంగా భూమిని ఇతరుల పేరుపై పట్టా చేయించి విక్రయించారని ఆరోపించారు. ఈ విషయమై ప్రశ్నించగా తనను దూషించడంతో పాటు భూమి విషయం గురించి మరలా అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని అయిలయ్య వాపోయారు. దీంతో తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భూ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని, అక్రమంగా జరిగిన పట్టా మార్పిడి, విక్రయాలపై చర్యలు తీసుకోవాలని అయిలయ్య అధికారులను కోరారు. కాగా, ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల వివరణ తెలియాల్సి ఉంది. అధికారులు విచారణ చేపట్టిన అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Next Story