బెజ్జూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ‘లేట్ ఫీజు’ వసూళ్ల ఆరోపణలు

by Ratna Kumari |

బెజ్జూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల నుంచి ‘లేట్ ఫీజు’ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

బెజ్జూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ‘లేట్ ఫీజు’ వసూళ్ల ఆరోపణలు
X

దిశ, బెజ్జూర్ : బెజ్జూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల నుంచి ‘లేట్ ఫీజు’ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఆలస్యంగా పాఠశాలకు వస్తున్నారనే కారణంతో అక్కడి వార్డెన్ శ్రీనివాస్ ప్రతి విద్యార్థి నుంచి రూ.100 నుంచి రూ.150 వరకు వసూలు చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం ఆరోపించారు. ఒక విద్యార్థి తండ్రి వద్ద రూ.150 లేకపోవడంతో తాము డబ్బులు ఎందుకు చెల్లించాలని ప్రశ్నించినట్లు తెలిపారు. విద్యార్థులు ఆలస్యంగా వస్తున్నందున వారిలో క్రమశిక్షణ పెంపొందించేందుకు, భయం కలిగించాలనే ఉద్దేశంతో లేట్ ఫీజు వసూలు చేస్తున్నట్లు వార్డెన్ తెలిపినట్లు విద్యార్థి తండ్రి పి. సుధాకర్ పేర్కొన్నారు. అలాగే వసూలు చేసిన డబ్బును ఏం చేస్తారని ప్రశ్నించగా, పాఠశాల అవసరాల కోసమే వినియోగిస్తామని వార్డెన్ చెప్పినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే వంద మందికి పైగా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు, దీనికి సంబంధించిన రికార్డులు కూడా ఉన్నాయని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ విషయమై ఆశ్రమ పాఠశాల వార్డెన్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా, పాఠశాల ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నప్పటికీ కొందరు విద్యార్థులు ఇంకా హాజరు కావడం లేదని, విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించేందుకు మాత్రమే లేట్ ఫీజు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే, విద్యార్థుల నుంచి ఈ విధంగా డబ్బులు వసూలు చేయడానికి సంబంధిత శాఖ నుంచి అనుమతి ఉందా లేదా అనే అంశంపై అధికారులు స్పందించాల్సి ఉంది.

Next Story