- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతకు సరికొత్త అవకాశాలు
భవిష్యత్ ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

- టాస్క్-ఎక్విప్ ఫెలోస్ ప్రోగ్రామ్ ప్రారంభం
దిశ, తెలంగాణ బ్యూరో: భవిష్యత్ ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలో సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీ సంస్థ ఎక్విప్ (ఈక్యూయూఐపీపీపీ)తో కలిసి దేశంలోనే తొలిసారిగా ఎక్విప్ ఫెలోస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. సామాజికాభివృద్ధి రంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే నిపుణులను తయారు చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వివరించింది. విద్యాసంస్థల్లో నేర్చుకున్న పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా టాస్క్ అభ్యర్థులను ఎంపిక చేసి, వారి సామర్థ్యాలను అంచనా వేసి, ఎక్విప్ రూపొందించిన ప్రత్యేక పాఠ్యాంశాలతో శిక్షణ అందిస్తుంది. అనంతరం వారిని ఎక్విప్ ఫెలోస్‌గా నియమించి వివిధ సామాజికాభివృద్ధి ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం కల్పించనుంది. ఈ ఫెలోషిప్ 6 నుంచి 12 నెలల వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో క్లాస్‌రూమ్ శిక్షణతోపాటు డిజిటల్ టెక్నాలజీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఆధారిత పాలన, ప్రాజెక్టు నిర్వహణ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు.
అలాగే ప్రభుత్వ, సామాజిక సంస్థల ప్రాజెక్టుల్లో ప్రత్యక్షంగా పనిచేసే అవకాశం కూడా కల్పిస్తారు. ఫెలోషిప్ కాలంలో ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ అందించనున్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన వారికి పూర్తి స్థాయి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే అవకాశం ఉన్నదని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఏటా రూ.25 వేల కోట్లకు పైగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు ఖర్చవుతుండగా.. 34 లక్షలకు పైగా నమోదిత స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వాలు, సీఎస్ఆర్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంస్థలు, అభివృద్ధి సంస్థలు డిజిటల్ టెక్నాలజీ ఆధారిత సేవలపై దృష్టి పెడుతున్న నేపథ్యంలో సోషల్ టెక్ ప్రొఫెషనల్స్‌కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టాస్క్-ఎక్విప్ భాగస్వామ్యం తెలంగాణ యువతకు భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు అందించడంతోపాటు సామాజికాభివృద్ధి రంగంలో ఉపాధి అవకాశాలను పెంచుతుందని అధికారులు పేర్కొన్నారు.






