- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమ్మం కార్పొరేషన్ లో చక్రం తిప్పుతున్న పక్క జిల్లా కాంట్రాక్టర్
పక్క జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ అదే జిల్లా మంత్రి పేరు చెప్పి ఖమ్మం కార్పొరేషన్ లో చక్రం తిప్పుతుండటం వివాదంగా మారుతుంది.

పక్క జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ అదే జిల్లా మంత్రి పేరు చెప్పి ఖమ్మం కార్పొరేషన్ లో చక్రం తిప్పుతుండటం వివాదంగా మారుతుంది. ‘నేను మంత్రి మనిషిని.. నన్నే కాదంటారా ?.. నా పనులకు వంకలు పెడుతారా..? ఇదిగో మంత్రితో దిగిన ఫొటోలు చూడండి.. ఒకసారి మంత్రితో మాట్లాడించమంటారా..?’ అంటూ కార్పొరేషన్ అధికారులకు చుక్కలు చూపిస్తుండటంతో ఎందుకు ఈ తంటాలన్నీ భావించిన అధికారులు ఆయనకు ఆయన పనులకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. కాంట్రాక్టులు పొంది బినామీలకు పనులు అప్పగించినా ఆ కాంట్రాక్టర్ ను అడిగే సాహసం చేయడం లేదు. అలాగని నాణ్యతగా పనులు పూర్తిచేస్తున్నారా ? అంటే అదీ లేదు.. ప్రస్తుతం ఈ టాపిక్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది నోళ్లలో హాట్ టాపిగ్గా మారిపోయింది.
దిశ, ఖమ్మం కార్పొరేషన్ : ఖమ్మం కార్పొరేషన్ లో పక్కజిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదు. ఆ జిల్లాకు చెందిన ఓ మంత్రి పేరు చెప్పి అధికారులను, సిబ్బందిని బెదిరిస్తూ తన పబ్బం గడుపుకోవడం పరిపాటిగా మారిందని, మంత్రితో మాట్లాడుతారా అంటూ పనులు చక్కబెట్టుకుంటున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతుంది. కాంట్రాక్టులు పొంది పనులను బినామీలతో చేయిస్తున్నా.. నాసిరకంగా పనులు జరుగుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని, బిల్లులు మాత్రం టకీమని క్లియర్ అవుతున్నాయన్న టాక్ నడస్తుంది. ఒక్కనికే ప్రియారిటీ ఇవ్వడం, అధిక సంఖ్యలో పనులు కట్టబెట్టడంతో పాటు బిల్లులు కూడా క్లియర్ అవుతుండటంతో ఏళ్లుగా పనిచేస్తున్న మిగతా కాంట్రాక్టర్ తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తుంది.
పక్క జిల్లా మంత్రి పేరు చెప్పి..
పక్కజిల్లాకు చెందిన ఒక కాంట్రాక్టర్ ఖమ్మం కార్పొరేషన్ లో హడావిడి చేయటం చర్చకు దారితీస్తున్నది. ఎప్పటినుంచో ఖమ్మం కార్పొరేషన్ లో ఖమ్మంకు చెందిన కాంట్రాక్టర్లు పనులు చేస్తుండగా ఈ కాంట్రాక్టర్ పక్క జిల్లా నుంచి వచ్చి అక్కడి మంత్రి పేరు చెప్పి అధికారులను బెదిరించడం కాంట్రాక్టర్ల అసోసియేషన్ లో చర్చకు వస్తున్నది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో జరిగే పలు అభివృద్ధి పనులలో సింహభాగం దక్కించికొని ఎప్పుడో ఒకసారి వస్తూ, పనులు చేసే చోట తన సూపర్వైజర్ల నుంచి పనులు చేయించుకున్నారనన్నది బహిరంగ రహస్యమే. ఇక కాంట్రాక్టులు దక్కించుకోవడం దగ్గర నుండి బిల్లులు మంజూరు చేయించుకోవడం వరకు మంత్రి పేరు ఉపయోగించుకోవటం గమనార్హం. ఇంజనీరింగ్ శాఖ అధికారులు సైతం ఈ కాంట్రాక్టర్ ఒత్తిడికి లొంగిపోతున్నట్లు విమర్శలున్నాయి. ఆంజనేయ స్వామిని తలచుకుంటూ పక్క జిల్లాకు చెందిన ఈ కాంట్రాక్టర్ పనులు హుటాహుటిన చేస్తున్నారు. ఎప్పటి నుండో పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల బిల్లును పక్కన పెట్టి మరీ ఈ కాంట్రాక్టర్ కు దాసోహం అంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మంత్రితో దిగిన ఫోటోను చూపెడుతూ పనులు చేయించుకుంటున్నాడు.
చేసేవన్నీ నాసిరకం పనులే..
పక్క జిల్లాకు చెందిన ఈ కాంట్రాక్టర్ టెండర్ల ద్వారా దక్కించుకున్న అభివృద్ధి పనులను నాసిరకంగానే ఉంటున్నాయి. ఇష్టారీతిగా పనులు చేస్తున్నప్పటికీ ఇంజనీరింగ్ అధికారులు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. వర్క్ ఇన్స్పెక్టర్లు సైతం ఇతడి పనులను ఆపేందుకు భయపడుతున్నారు. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేస్తున్న ఈ కాంట్రాక్టర్ పనుల వద్ద ఉండక, బిల్లుల కోసం అధికారుల వద్ద ఎక్కువ సమయం ఉంటున్నాడు. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చి పోతుంటారు. ఇంజనీరింగ్ విభాగంలోని ఒక ఏఈ ఇతడికి సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నగరంలోని 50వ డివిజన్లో డ్రైనేజీల నిర్మాణం చేస్తున్న ఈ కాంట్రాక్టర్ చెట్లు ఉంచి వంకర టింకరగా డ్రైనేజీ నిర్మాణం చేపట్టినా అధికారులు పల్లెత్తు మాట అనలేదు. మరోచోట చెట్లు అడ్డుగా ఉన్నాయని నరికించి అక్కడే పడవేశారు. వాస్తవంగా కాంట్రాక్టర్ చేసిన తర్వాత అక్కడ శుభ్రంగా ఉంచాలి ఎటువంటి నిబంధనలు పట్టించుకోకుండా పక్క జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ తొలగించిన చెట్లను నరికి అక్కడే ఉంచడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. చివరకు కమిషనర్ జోక్యంతో కార్పొరేషన్ సిబ్బంది సదరు చెట్లను అక్కడనుండి తరలించారు.
కాంట్రాక్టులు పొంది.. బినామీలకు అప్పగించి..
అధికారుల మీద ఒత్తిడి తెచ్చి పనులు పొందిన ఈ పక్క జిల్లా కాంట్రాక్టర్ వాటిని బినామీలకు అప్పగించి సొమ్ములు తీసుకుంటున్నాడు దీంతో నాసిరకంగా పనులు సాగుతున్నాయి. ఒకటో డివిజన్లో అలాగే 59, 60 డివిజన్లలో రోడ్లు కల్వర్టుల నిర్మాణాలకు కాంట్రాక్ట్ దగ్గించుకొని బినామీలకు అప్పగించారని సమాచారం. అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు పనులకు టెండర్లు వేసి వాటిని దక్కించుకున్నాడు అక్కడ తూతూ మంత్రంగానే పనులు సాగుతున్నాయి. కమిషనర్ అభిషేక్ అగస్త్య దృష్టి పెట్టి కాంట్రాక్టర్ పై చర్య తీసుకోకుంటే నగరంలో నాసిరకం పనులు జరిగి ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అభిప్రాయాలు వినవస్తున్నాయి.






