మడిపల్లి హత్య కేసు ఛేదించిన పోలీసులు...

by Kodari Anjali |

జమ్మికుంట మండలం మడిపల్లి శివారులో 27-06-2026న జరిగిన పైతరి మొగిలి హత్య కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు

మడిపల్లి హత్య కేసు ఛేదించిన పోలీసులు...
X

దిశ, జమ్మికుంట: జమ్మికుంట మండలం మడిపల్లి శివారులో 27-06-2026న జరిగిన పైతరి మొగిలి హత్య కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. నిందితుడు మడిపల్లికి చెందిన గంగారపు మహేష్ (40) ను సోమవారం ఉదయం 10.30 గంటలకు ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, రక్తపు మరకలున్న దుస్తులు, సెల్‌ఫోన్, మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

హత్యకు దారితీసిన కారణాలు...

తన పొలం దగ్గర కౌలుకు వ్యవసాయం చేసే ఓ వివాహితతో మహేష్‌కు సన్నిహిత పరిచయం ఏర్పడింది. అదే సమయంలో మృతుడు మొగిలి ఆ మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మహేష్ ఆమెకు అండగా నిలిచి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించాడు. ఆ కేసులో మొగిలి జైలుకు వెళ్లి వచ్చాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత మొగిలి తనను తరచూ అవమానిస్తూ, దూషిస్తూ, రెచ్చగొడుతూ వచ్చాడని మహేష్ చెప్పాడు. ఈ కారణంగా తన కుటుంబంలో, ఆ మహిళ కుటుంబంలో తీవ్ర విభేదాలు వచ్చాయి. వీటన్నింటికీ మొగిలే కారణమని భావించి హత్యకు పథకం వేశాడు.

పక్కా ప్లాన్‌తో హత్య....

పీర్ల పండుగకు మడిపల్లికి వచ్చిన మొగిలిని చూసిన మహేష్, ముందుగా యూట్యూబ్‌లో "హత్యలు ఎలా చేయాలి, ఆయుధాల తయారీ" అంటూ వీడియోలు వెతికాడు.ఇంటి నుంచి ఇనుప రాడ్ తీసుకొని, తన పొలం దగ్గర అంకుశాపూర్ దారిలోని మోరిపై కూర్చొని మద్యం తాగుతూ మాటు వేశాడు. రాత్రి 11:45 గంటలకు సైకిల్‌పై ఇంటికి వెళ్తున్న మొగిలిపై వెనుక నుంచి తలపై బలంగా కొట్టాడు. కిందపడిపోయిన తర్వాత తల, ముఖంపై విచక్షణారహితంగా పలుమార్లు కొట్టి చనిపోయాడని నిర్ధారించుకున్నాడు. హత్య తర్వాత ఇనుప రాడ్‌ను తన వ్యవసాయ బావి పక్కన ల్యాదోట తాళ్లల్లో పడేసి, ఇంటికి వెళ్లి రక్తపు దుస్తులు మార్చుకున్నాడు. హుజురాబాద్ ఏసిపి మాధవి మాట్లాడుతూ.. జమ్మికుంట సీఐ ఆధ్వర్యంలో ఎస్సై సంజీవ్, సిబ్బంది ఈ కేసును వేగంగా ఛేదించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించాం. "చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. ఏదైనా సమస్య ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయండి. పగ, కక్షలతో హత్యలకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదు" అని హెచ్చరించారు.

Next Story