- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై ఉక్కుపాదం
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు, స్టేటస్‌లు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు.

దిశ, ఇచ్చోడ : శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు, స్టేటస్‌లు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గత రెండు రోజుల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన ముగ్గురు వ్యక్తులపై మూడు కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసినట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇచ్చోడ మండలంలోని సిరిచల్మ గ్రామ ఉపసర్పంచ్ అబ్దుల్ అజీమ్ ఆర్మూర్‌లో జరిగిన ఘటనను వక్రీకరిస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టే వీడియోను రూపొందించి తన వాట్సాప్ స్టేటస్‌లో పోస్టు చేసినందుకు అతనిపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతని సెల్‌ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఇస్లాంపూర్‌కు చెందిన యూనుస్ (20) ఆర్మూర్ ఘటనను వక్రీకరిస్తూ ఇరు వర్గాలను రెచ్చగొట్టే పోస్టులను సోషల్ మీడియాలో ప్రచారం చేసినందుకు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇంద్రవెల్లి మండలం ధనోరా (కె) గ్రామపంచాయతీ పరిధిలోని ఇంకారిగూడకు చెందిన జాడి జస్వంత్ (18) గ్రామంలో జరిగిన ఘటనను వక్రీకరిస్తూ జిల్లాలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు చేసినందుకు ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
ప్రతి సమాచారాన్ని నిజానిజాలు నిర్ధారించుకోకుండా సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ప్రజలకు సూచించారు. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో లేదా స్టేటస్‌లలో శాంతిభద్రతలకు భంగం కలిగించే పోస్టులు, వీడియోలు, సందేశాలు కనిపిస్తే వెంటనే వాటిని తొలగించి సంబంధిత వ్యక్తులను హెచ్చరించాలని గ్రూప్ అడ్మిన్లకు సూచించారు. నిర్లక్ష్యం చేసినా లేదా ఉద్దేశపూర్వకంగా అలాంటి పోస్టులను కొనసాగించినా అవసరమైతే గ్రూప్ అడ్మిన్లపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ప్రజలు శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. అనుమానాస్పద పోస్టులు లేదా విద్వేషపూరిత సందేశాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా జిల్లా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.






