సార్థక్ సిద్ధాంత్ ను ప్రశంసించిన రాహుల్ గాంధీ

by Muthe.Rajitha |

జార్ఖండ్‌కు చెందిన 17 ఏళ్ల ప్లస్ టూ విద్యార్థి సార్థక్ సిద్ధాంత్ సాహసోపేతమైన పోరాటంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సార్థక్ సిద్ధాంత్ ను ప్రశంసించిన రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్ : జార్ఖండ్‌కు చెందిన 17 ఏళ్ల ప్లస్ టూ విద్యార్థి సార్థక్ సిద్ధాంత్ సాహసోపేతమైన పోరాటంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సిబిఎస్‌ఇ (CBSE) ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) టెండర్ ప్రక్రియలో జరిగిన అక్రమాలను, నిబంధనల ఉల్లంఘనలను ఎత్తిచూపుతూ సార్థక్ రాసిన ఒక బ్లాగ్ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ ఉదంతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి వెళ్లడంతో, ఆయన ఆ బ్లాగ్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, ఆ విద్యార్థి చూపిన చొరవను కొనియాడారు. సార్థక్ తన బ్లాగ్ ద్వారా CBSE విద్యాసంస్థ నిబంధనలను మార్చి మరీ 'కోఎమ్ట్' (Coempt) అనే ఒక నిర్దిష్ట ప్రైవేట్ కంపెనీకి లబ్ధి చేకూర్చేలా టెండర్ ప్రక్రియను నడిపిన తీరును ఆధారాలతో సహా బయటపెట్టాడు. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన రాహుల్ గాంధీ, జూన్ 2న స్వయంగా సార్థక్ సిద్ధాంత్, అతని కుటుంబాన్ని ఢిల్లీలో కలిసి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ అబ్బాయి మేధస్సును, ధైర్యాన్ని అభినందిస్తూ తన మద్దతును ప్రకటించారు.

ఈ భేటీ అనంతరం రాహుల్ గాంధీ తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. సార్థక్ పేరులోని 'సిద్ధాంత్' అనే పదాన్ని ప్రస్తావిస్తూ.. “సార్థక్, అప్నే సిద్ధాంతోం పే అడిగ్ రహో” (సార్థక్, నీ సిద్ధాంతాలపై ఎప్పుడూ దృఢంగా నిలబడు) అంటూ హిందీలో రాసుకొచ్చారు. ఈ టైమింగ్, పేరుతో చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకోవడమే కాకుండా అందరిలోనూ నవ్వులు పూయించింది. కాగా, కేవలం 12వ తరగతి చదువుతున్న సార్థక్, ఈ టెండర్ అక్రమాల వ్యవహారాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (Parliamentary Standing Committee) ముందు కూడా స్వయంగా హాజరై వివరించడం గమనార్హం. ఒక చిన్న విద్యార్థి చేసిన పరిశోధన నేడు జాతీయ స్థాయిలో సిబిఎస్‌ఇ టెండర్ల పారదర్శకతపై పెద్ద చర్చకు తెరలేపింది.అయితే మొదట CBSE ఈ ఆరోపణలను కొట్టి పారేసినప్పటికీ.. అనంతరం సంస్థ ఛైర్మన్ రాహుల్ సింగ్, సెక్రెటరీ హిమాన్షు గుప్తాను వారి పదవుల నుంచి తప్పించి బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ వ్యవహారంపై రాధా చౌహన్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీని కూడా నియమించింది.

Next Story