పీరియడ్స్ భయం వలన అమ్మాయిలు స్కూల్ మానేస్తున్నారు : ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా

by Muthe.Rajitha |

మహిళల ఆరోగ్యంపై చద్దా కీలక వ్యాఖ్యలు చేశారు. పీరియడ్స్ వివక్ష చూపడం మన సమాజ వైఫల్యం అని ఆవేదన వ్యక్తం చేసారు.

పీరియడ్స్ భయం వలన అమ్మాయిలు స్కూల్ మానేస్తున్నారు :  ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా
X

దిశ, వెబ్ డెస్క్ : ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో చేసిన ప్రసంగం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజ్యసభ సమావేశాల్లో మహిళల ఆరోగ్యం, పీరియడ్స్ సమయంలో వారు ఎదుర్కొంటున్న సామాజిక ఇబ్బందులపై కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయ అంశాల కంటే మిన్నగా, ఒక సామాజిక మార్పు కోసం ఆయన గళం విప్పడం ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది.

రాఘవ్ చద్దా తన ప్రసంగంలో.. నెలసరి అనేది ఒక ప్రకృతి సిద్ధమైన ప్రక్రియ అని, ఇది ఏ మహిళకైనా గర్వకారణమే తప్ప సిగ్గుపడాల్సిన విషయం కాదని స్పష్టం చేశారు. మన సమాజంలో మద్యం, సిగరెట్లు వంటి హానికరమైన వస్తువులను ఎటువంటి సంకోచం లేకుండా బహిరంగంగా విక్రయిస్తుంటే, మహిళల ఆరోగ్యానికి అవసరమైన శానిటరీ ప్యాడ్లను మాత్రం పేపర్లలో లేదా నల్లటి కవర్లలో దాచుకుని తీసుకెళ్లాల్సి రావడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధమైన 'టాబూ' మన సమాజ వైఫల్యానికి నిదర్శనమని, దీనివల్ల మహిళల ఆత్మగౌరవం దెబ్బతింటోందని ఆయన బలంగా వాదించారు.

దేశంలోని దాదాపు 35 కోట్ల మంది మహిళల ఆరోగ్యం, గౌరవానికి ఇది సంబంధించిన అంశమని చద్దా పేర్కొన్నారు. పీరియడ్స్ సమయంలో సరైన అవగాహన లేకపోవడం, శానిటరీ ఉత్పత్తులు అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది బాలికలు బడి మానేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మాయిలు పీరియడ్స్ విషయంలో ఎటువంటి భయం లేదా మొహమాటం లేకుండా స్వేచ్ఛగా పాఠశాలలకు వెళ్లగలిగిన రోజే దేశం నిజమైన ప్రగతిని సాధించినట్లుగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళల ఆరోగ్యంపై ఖర్చు చేయడం అనేది దేశ భవిష్యత్తుపై చేసే పెట్టుబడి అని ఆయన తన ప్రసంగంలో గుర్తుచేశారు.

ఈ ప్రసంగం ద్వారా పీరియడ్స్ పట్ల ఉన్న మూఢనమ్మకాలను తొలగించి, మహిళల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా పాఠశాలల్లో ఉచిత శానిటరీ ప్యాడ్ల పంపిణీ, పరిశుభ్రమైన మరుగుదొడ్ల ఏర్పాటు ప్రాథమిక హక్కుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Next Story