రియ‌ల్ ఎస్టేట్ త‌గాదాల‌తో హత్య.. 8మందిని అరెస్టు చేసిన పోలీసులు

by Disha Web |
రియ‌ల్ ఎస్టేట్ త‌గాదాల‌తో హత్య.. 8మందిని అరెస్టు చేసిన పోలీసులు
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్ : బాలాపూర్‌లో జ‌రిగిన హ‌త్య‌కేసులో పోలీసులు ఎనిమిది మంది నిందుల‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. ఈ మేర‌కు గురువారం రాచకొండ క‌మిష‌న‌ర్ క్యాంపు కార్యాల‌యంలో ఎల్బీన‌గ‌ర్ జోన్ డీసీపీ స‌న్‌ప్రీత్ సింగ్ మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు. ఆ నిందితుల నుండి రెండు క‌త్తుల‌ను, నాలుగు ద్విచ‌క్ర‌వాహ‌నాల‌ను, ఎనిమిది సెల్‌ఫోన్‌ల‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

రియ‌ల్ ఎస్టేట్ త‌గాదాల‌తో ఈ నెల 20న బాల‌పూర్‌కు చెందిన ఇలియాస్ న‌వాబ్ హ‌త్య‌కు గుర‌య్యాడు. ఈ హ‌త్య‌కేసులో చాంద్రాయ‌ణ‌గుట్ట‌కు చెందిన సాల్హే బిన్ హ‌ఫీజ్ మ‌హ‌రోజ్, అబూబాక‌ర్ బిన్ హ‌ఫీజ్ (21), ఇస్మాయిల్ బిన్ అబ్డుల్ అజీజ్ (19), జాఫ‌ర్ బిన్ అవాలీ (32), బాబెర్ హ‌మ్ధీ (24), షేక్ మాజిద్ అలీ హ‌స‌న్ (21), ఇబ్ర‌హీం మ‌హ్మద్‌బిన్ అబ్ధుల్ అజీజ్ అల్ క‌సేరీ(20), మునాసిర్ అమీర్ బ‌రాసిత్(20) నిందితుల‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో హ‌త్య‌కు గురైన ఇలియాస్ న‌వాబ్‌.. ప్ర‌ధాన నిందితుడు సాల్హేబిన్ హ‌ఫీజ్ మ‌హ‌రోజ్‌లు గ‌త కొంత కాలంగా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ర‌క‌ర‌కాల కేసుల‌లో ఉన్న స్థ‌లాల‌ను వీరు కొనుగోలు చేస్తూ సెటిల్‌మెంట్ చేసేవారు.

ఈ క్ర‌మంలో బాలాపూర్‌లోని ఓ ప్లాటు విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు ఏర్ప‌డ్డాయి. అప్ప‌టి నుండి నిందితుడు సాల్హేబిన్ హ‌ఫీజ్ మ‌హ‌రోజ్ త‌న వ్యాపార భాగ‌స్వామి అయిన ఇలియ‌స్ న‌వాబ్‌పై క‌క్ష పెంచుకున్నాడు. ఈ క్ర‌మంలో నిందితుల‌లో ఒక‌రైన ఇబ్ర‌హీం మ‌హ‌మ్మ‌ద్ బిన్ అబ్ధుల్ అజీజ్ అల్ క‌సేరీ పుట్టిన రోజు ఉండ‌డంతో ఇలియ‌స్ న‌వాబ్ ఈ వేడుకుల‌కు హాజ‌ర‌య్యాడు. హ‌త్య‌కు ముందుగానే ప‌క్కా ప్లాన్ వేసి నిందితులు క‌త్తుల‌తో ఇలియాస్ న‌వాబ్‌పై దాడి చేసి, అక్క‌డి నుండి ప‌రార‌య్యారు.

దీంతో తీవ్ర గాయాల‌కు గురైన ఇలియాస్ న‌వాబ్ త‌న స్నేహితుడు జాకిరియా హుస్సెన్‌కు ఫోన్ చేశాడు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న హుస్సెన్ ఇలియాస్‌ను ఓవైసీ హాస్ప‌ట‌ల్‌కు తీసుకెళ్లాడు. అప్ప‌టికే అత‌డు మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. దీంతో హ‌త్య కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు చేప‌ట్టి.. ఎనిమిది మంది నిందితుల‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు త‌ర‌లించారు. ఈ స‌మావేశంలో వ‌న‌స్థ‌లిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, బాలాపూర్ ఇన్‌స్పెక్ట‌ర్ బి. భాస్క‌ర్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







Next Story

Most Viewed