- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్కెట్లో నకిలీ విత్తనాలు.. టాస్క్ ఫోర్స్ టీం విస్తృత తనిఖీలు
ఆరుగాలం కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చుకుని పంటలు పండించే రైతులకు చీడ, పీడలతోనే కాదు.. రైతు సమాజానికి చీడపురుగుల్లా దాపురించిన నకిలీ విత్తన విక్రేతలతోనూ ప్రమాదం ఏర్పడింది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఆరుగాలం కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చుకుని పంటలు పండించే రైతులకు చీడ, పీడలతోనే కాదు.. రైతు సమాజానికి చీడపురుగుల్లా దాపురించిన నకిలీ విత్తన విక్రేతలతోనూ ప్రమాదం ఏర్పడింది. వీరితో జాగ్రత్తగా లేకుంటే రైతుల వ్యవసాయానికి మొదటికే మోసం వచ్చేలా పరిస్థితులున్నాయని అధికారులంటున్నారు. తమ కంపెనీ విత్తనాలు వాడితే పంట సాగులో చీడ పీడల బెడద ఉండదని, వాటి నివారణ కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఎరువులు వాడాల్సిన అవసరమే రాకుండా పంటలు సాగు చేయొచ్చనే ఆశలు చూపించి అమాయక రైతులను మోసం చేసేందుకు నకిలీ విత్తన విక్రేతలు మార్కెట్ లో చొరబడ్డారు. వారిని నియంత్రించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంది.
మహారాష్ట్ర నుండి జిల్లాకు నకిలీ విత్తనాలు..
కొత్త కొత్త బ్రాండ్లతో రైతులకు విత్తనాలను అంట గట్టేందుకు మహారాష్ట్ర లోని కొన్ని నాసిరకం విత్తన తయారీ సంస్థల్లో తయారైన విత్తనాలను జిల్లాలో మార్కెటింగ్ కోసం తీసుకొచ్చి జిల్లాలో కొందరు సీడ్స్ షాపులకు సప్లై చేస్తునట్లు తెలుస్తోంది. ఆయా కంపెనీల ప్రతినిధులు నేరుగా అయాయక రైతులకే అమ్ముతున్నట్లు రైతులు చెబుతున్నారు. నకిలీ విత్తన విక్రేతలు మార్కెట్ లోకి వచ్చేశారు. నేరుగా రైతులకే కాకుండా విత్తనాల డీలర్లకు కూడా ఎక్కువ మొత్తంలో కమిషన్ ఆశ చూపి తమ కంపెనీలకు చెందిన విత్తనాలను ఎక్కువ మొత్తంలో మార్కెట్లో విక్రయించేలా ప్లాన్ చేస్తున్నారు. అయాయక చిన్న సన్నకారు రైతులను ఈ నకిలీ విత్తన విక్రేతలు బురిడీ కొట్టించి నకిలీ విత్తనాలను అంటగట్టే ప్రమాదం పొంచి ఉంది.
ఇప్పటికే కొన్ని కంపెనీల ప్రతినిధులు తమ కంపెనీకి చెందిన బ్రాండ్ల విత్తనాల గురించి గ్రామాల్లో ప్రచారం చేస్తూ సీడ్స్ మార్కెట్ చేస్తున్నట్లు రైతులు అంటున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమై నకిలీ విత్తనాల విషయంలో ఓ పక్క రైతులను చైతన్యపరుస్తూనే, మరో పక్క నకిలీ విత్తనాల నియంత్రణ కోసం వ్యవసాయ శాఖ, పోలీస్, రెవెన్యూ తదితర ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలతో జిల్లా వ్యాప్తంగా సీడ్స్ షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఈ టాస్క్ ఫోర్స్ టీంలు విస్తృతంగా తిరుగుతూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండటంతో సీడ్స్ షాప్ నిర్వాహకులు ఆందోళనకు గురవుతున్నారు.
జిల్లాలో 455 సీడ్స్ షాపులు..
జిల్లాలో 455 విత్తనాలు విక్రయించే రిజిష్టర్డ్ షాప్స్ ఉన్నాయి. రైతులు ప్రతి సీజన్ లో తమకు అందుబాటులో ఉన్న షాపుల్లో రెగ్యులర్ గా వెళ్లి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. రిజిస్ట్రార్డ్ సీడ్స్ షాపుల్లో ప్రభుత్వ నిబంధనలకు లోబడి సీడ్స్ అమ్మకాలు జరపాల్సి ఉంది. కొన్ని షాపుల్లో ఎక్కువ మొత్తంలో కమిషన్లు చెల్లించే కంపెనీలకు చెందిన బ్రాండ్లు కూడా అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. నిబంధలను విరుద్ధంగా అమ్మాల్సిన కొత్త కంపెనీలకు చెందిన విత్తనాలను షాపుల్లో కాకుండా ఇతర రహస్య ప్రాంతాల్లో ఉంచి వాటిని కావాలనుకున్న రైతులకు అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో వ్యవసాయ పనుల కోసం రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వర్షాలు కురవడం ప్రారంభం కాగానే వ్యవసాయ పనులు కూడా ఊపందుకోనున్న తరుణంలో రైతులు ముందుగా విత్తనాలు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకుంటున్నారు.
టాస్క్ ఫోర్స్ టీంల విస్తృత తనిఖీలు..
జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాల ఏరివేతకు, వాటి నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ టీంలు అన్ని సీడ్స్ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. ఎక్కడా ఏ షాపును వదలకుండా అన్ని షాపులను ఈ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. షాపుల్లో ఎలాంటి అనుమానాస్పద ప్రొడక్ట్ కనిపించిన.. అవి నకిలీ విత్తనాలని తేలినా చట్టపరమైన చర్యలు తప్పవని, షాపు లైసెన్సు కూడా రద్దు చేసి కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. నకిలీ విత్తనాలు లేని జిల్లాగా రైతులు ఆరోగ్యకరమైన వ్యవసాయం చేసుకునే వాతావరణాన్ని కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి అన్నారు. నకిలీ విత్తనాల విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని, ప్రతి మంగళవారం రైతు వేదికల్లో ఏర్పాటు చేస్తున్న సమావేశాల్లో కూడా రైతులకు నకిలీ విత్తనాలపై ఏడీఏలు, ఏఈఓ లు అవగాహన కల్పిస్తున్నట్లు జేడీఏ తెలిపారు. అన్ని ప్రముఖ కంపెనీలకు చెందిన విత్తనాలు విక్రయించే షాపులన్నింట్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నటు తెలిపారు.






