రాజస్థాన్‌లో పోలీసుల ఆపరేషన్ సక్సెస్.. ధాన్యం లోడుతో సహా చిక్కిన డీసీఎం డ్రైవర్

by Jakkula.Mamatha |

రైతుల కష్టార్జిత ధాన్యాన్ని డీసీఎం వాహనంతో సహా ఎత్తుకెళ్లిన డ్రైవర్‌ను గౌరారం పోలీసులు రాజస్థాన్‌లో పట్టుకున్నారు.

రాజస్థాన్‌లో పోలీసుల ఆపరేషన్ సక్సెస్.. ధాన్యం లోడుతో సహా చిక్కిన డీసీఎం డ్రైవర్
X

దిశ, వర్గల్: రైతుల కష్టార్జిత ధాన్యాన్ని డీసీఎం వాహనంతో సహా ఎత్తుకెళ్లిన డ్రైవర్‌ను గౌరారం పోలీసులు రాజస్థాన్‌లో పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. 491 బస్తాల వరి ధాన్యంతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అక్కడి కోర్టు అనుమతితో సిద్దిపేట జిల్లా గౌరారం పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. గత నెల 28న కుకునూరుపల్లి మండలం తిప్పారం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ఎనిమిది మంది రైతుల 491 బస్తాల వరి ధాన్యాన్ని రాజస్థాన్‌కు చెందిన ఆర్‌జే-14 జీయూ-9948 నంబర్ డీసీఎం వాహనంలో వర్గల్ మహాదేవ్ ఆగ్రో ఇండస్ట్రీ రైస్ మిల్లుకు తరలించారు.

అయితే అదే రాత్రి డ్రైవర్ ధాన్యం బస్తాలతో సహా పరారవడంతో గౌరారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రైతుల జీవనాధారానికి సంబంధించిన ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకుని, జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గౌరారం, కుకునూరుపల్లి ఎస్ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక బృందం రాజస్థాన్‌కు వెళ్లి ముమ్మర గాలింపు చేపట్టింది. చివరికి వారి కృషి ఫలించి, ధాన్యం లోడుతో సహా నిందితుడు పోలీసులకు చిక్కినట్లు తెలిపారు. ఈ ఘటనతో తిప్పారం రైతులు ఊపిరి పీల్చుకోగా, గౌరారం పోలీసుల పనితీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Next Story