బ్రేకప్ చెప్పిందని ఘాతుకం.. మాజీ ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ఉన్మాది

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-05 04:11:30  IST  )

పంజాబ్‌లోని మొహాలీలో దారుణం చోటుచేసుకుంది.

బ్రేకప్ చెప్పిందని ఘాతుకం.. మాజీ ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ఉన్మాది
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ప్రేమ వ్యవహారాలు అత్యంత విషాదాంతంగా ముగుస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లోని మొహాలీలో ఓ ప్రైవేట్ ఆఫీసు లోపలే అత్యంత దారుణ హత్య చోటుచేసుకుంది. తనతో విడిపోయిందనే (Break-up) కక్షతో ఓ ప్రేమోన్మాది.. తన మాజీ ప్రియురాలిని ఆమె పని చేస్తున్న ఆఫీసులోనే అందరూ చూస్తుండగా కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అదే కత్తితో తను కూడా పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసుల కథనం మేరకు.. మృతురాలిని డింపిల్ (Dimple)గా గుర్తించారు. ఆమె మొహాలీ ఫేజ్-7 లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. నిందితుడు హర్జిందర్ సింగ్ మాన్ (Harjinder Singh Mann) గత కొంతకాలంగా ఆమెతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. అయితే, ఇటీవల వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో డింపిల్ అతనికి బ్రేకప్ చెప్పి దూరం పెట్టింది.

కత్తితో నేరుగా ఆఫీసుకు..

అయితే, ప్రియురాలు డింపుల్ తనను దూరం పెట్టడాన్ని తట్టుకోలేకపోయిన హర్జిందర్ నిన్న రాత్రి ఆమె పనిచేస్తున్న ఆఫీసులోకి నేరుగా చొరబడ్డాడు. బ్రేక్ సమయం కావడంతో ఆఫీసు సిబ్బంది చూస్తుండగానే డింపిల్‌తో గొడవకు దిగాడు. కోపంతో ఊగిపోతూ తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె ఛాతి, కడుపు భాగంలో తీవ్రంగా పొడవడంతో డింపిల్ రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. దాడికి సంబంధించి దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాగా, ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆఫీసు సిబ్బంది నిందితుడు హర్జిందర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించే లోపే అదే కత్తితో తన కడుపులో స్వయంగా పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హర్జిందర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ఆఫీసులోని సీసీటీవీ (CCTV) ఫుటేజీని స్వాధీనం చేసుకుని, తోటి ఉద్యోగుల నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నారు.

Next Story