బఫర్ జోన్‌ను వదలని బడా బాబులు.. ప్రమాదంలో మేళ్ల చెరువు భద్రత!

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-05 03:21:46  IST  )

ఒకప్పుడు గ్రామ ప్రజలకు సాగునీరు, భూగర్భ జలాల పరిరక్షణ, వర్షపు నీటి నిల్వకు ప్రధాన ఆధారంగా నిలిచిన తెల్లాపూర్ మేళ్లచెరువు నేడు ఆక్రమణలకు గురవుతుంది .

బఫర్ జోన్‌ను వదలని బడా బాబులు.. ప్రమాదంలో మేళ్ల  చెరువు భద్రత!
X

దిశ, రామచంద్రపురం: ఒకప్పుడు గ్రామ ప్రజలకు సాగునీరు, భూగర్భ జలాల పరిరక్షణ, వర్షపు నీటి నిల్వకు ప్రధాన ఆధారంగా నిలిచిన తెల్లాపూర్ మేళ్లచెరువు నేడు ఆక్రమణలకు గురవుతుంది. దీంతో స్థానికుల్లో చెరువు భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. చెరువు కట్ట వెనుక భాగంలో భద్రత కోసం కేటాయించిన బఫర్ జోన్‌లో కొందరు వ్యక్తులు యథేచ్ఛగా మొరం, మట్టి నింపుతూ భూములను ఆక్రమిస్తున్నారు.చెరువు కట్ట వర్షాకాలంలో ఎక్కువ మోతాదులో చేరే నీటి ఒత్తిడిని తట్టుకుని నివాస ప్రాంతాలను రక్షణగా నిలవాల్సిన చెరువు కట్ట ప్రాంతం మొత్తం ఆక్రమణకు గురి అవుతుంది .దీంతో నీటి ఒత్తిడి అధికమైనప్పుడు కట్ట వెనుక భాగంలో మరమ్మతులు నిర్వహించడానికి ఉపయోగించే వాహనాలు తిరగడానికి, అత్యవసర చర్యలు చేపట్టడానికి చెరువుల చుట్టూ బఫర్ జోన్‌లు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం మేళ్లచెరువు కట్ట వెనుక భాగంలో ఉన్న బఫర్ జోన్ ప్రాంతాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున మొరం, మట్టి తరలించి భూమిని చదును చేసి భవిష్యత్తులో నిర్మాణాలకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

భవిష్యత్తులో చెరువు కట్టకు ముప్పు..

చెరువు కట్ట వెనుక భాగంలో భారీగా మట్టి నింపడం వల్ల సహజ నీటి ప్రవాహం దెబ్బతింటుంది. అంతేకాకుండా కట్టపై అధిక భారం పడుతుంది. భారీ వర్షాల సమయంలో కట్ట బలహీనపడే ప్రమాదం ఉంటుంది. భవిష్యత్తులో కట్టకు చీలికలు ఏర్పడినా లేదా మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి వచ్చినా అధికారులు యంత్రాలతో అక్కడికి చేరుకునే పరిస్థితి లేకుండా పోతుంది .గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అనేక చెరువులు, కుంటలు, వరద కాలువలు ఆక్రమణలకు గురై వరదల సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భాలు కోకొల్లలు . అయినప్పటికీ మేళ్లచెరువు విషయంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇరిగేషన్ శాఖ అధికారులు మౌనం ఎందుకు?

చెరువు కట్ట బఫర్ జోన్‌ ను అక్రమన దారులు భారీ వాహనాలతో మొరం, మట్టి తరలించి నింపుతున్నా సంబంధిత ఇరిగేషన్ అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రోజురోజుకు ఆక్రమణలు పెరుగుతున్నా తనిఖీలు నిర్వహించకపోవడం, అక్రమ కార్యకలాపాలను అడ్డుకోకపోవడం వెనుక కారణాలేమిటని నిలదీస్తున్నారు.

వరద కాలువలపై కూడా కన్నెత్తి చూడని అధికారులు

మేళ్లచెరువు మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల్లోని వరద కాలువలు, చెరువుల ఫీడర్ ఛానెళ్లు కూడా ఆక్రమణల బారిన పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు వెళ్లే మార్గాలను మూసి వేయడం వల్ల భవిష్యత్తులో కాలనీలు, నివాస ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

బఫర్ జోన్ హద్దులను నిర్దారించి చెరువును కాపాడాలి: గ్రామస్థుల డిమాండ్

మేళ్లచెరువు బఫర్ జోన్‌లో జరుగుతున్న మట్టి నింపివేత పనులపై వెంటనే విచారణ చేపట్టాలని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, చెరువు కట్ట భద్రతకు ముప్పు కలిగించే అన్ని అక్రమ నిర్మాణాలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే చెరువు పూర్తి స్థాయి సర్వే నిర్వహించి బఫర్ జోన్ హద్దులను స్పష్టంగా గుర్తించి శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. చెరువుల రక్షణలో నిర్లక్ష్యం వదిలి ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story