ఆర్డీవో, కలెక్టర్ పై విచారణ..!

by Jakkula.Mamatha |

రెండున్నరేళ్ల క్రితం డీవోపీటీలో చేసిన ఫిర్యాదుల పై ప్రభుత్వం స్పందించింది.

ఆర్డీవో, కలెక్టర్ పై విచారణ..!
X

దిశ,చౌటుప్పల్: రెండున్నరేళ్ల క్రితం డీవోపీటీలో చేసిన ఫిర్యాదుల పై ప్రభుత్వం స్పందించింది. ఇప్పటికే ఫిర్యాదుదారులకు సమాచారం ఇచ్చి అందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే సమర్పించాలని కోరింది. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, చౌటుప్పల్ ఆర్డీవోలపై 2023వ సంవత్సరంలో డివోపిటితో పాటు,చీఫ్ సెక్రటరీ,సీసీఎల్ఏ కు ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలం అవడంతో పాటు నిషేధిత జాబితాలో ఉన్న భూములకు పట్టా పాస్బుక్కులు జారీ చేస్తున్నారని పక్కా సమాచారంతో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డిఓపిటి అప్పటి యాదాద్రి జిల్లా కలెక్టర్,చౌటుప్పల్ ఆర్డీవోల పనులపై విచారణ నిర్వహించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. దీంతో కదిలిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఫిర్యాదుదారులకు సమాచారం ఇచ్చి విచారణకు సిద్ధమయ్యారు.

ఓ పరిశ్రమ భూ ఆక్రమణ పై ఫిర్యాదులు!

చౌటుప్పల్ మండల పరిధిలో ఉన్న దేశంలోనే పేరొందిన ఓ ప్రముఖ పరిశ్రమ సుప్రీంకోర్టు లిక్విడేటర్‌లో ఉండి,జిల్లా కలెక్టర్ కస్టోడియన్ గా వ్యవహరిస్తున్న భూములను 100కు పైగా ఎకరాలు ఆక్రమించారని సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లో విచారణ నిర్వహించిన చౌటుప్పల్ ఆర్డీవో కేవలం మూడు గుంటలు మాత్రమే సదరు భూమి ఉందని నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. ఇలా తప్పుడు నివేదిక ఇచ్చేందుకు అప్పట్లో ఆర్డీవో తో పాటు జిల్లా కలెక్టర్ కు భారీగా ముడుపులు అందాయని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని కూడా వివరించారు. ప్రభుత్వానికి రావాల్సిన 20 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఎగ్గొట్టేందుకు అప్పట్లో అధికారులు సదరు పరిశ్రమ నుంచి భారీగా డబ్బులు తీసుకొని సహకరించారని ఆరోపించారు. కలెక్టర్ కస్టోడియన్ గా ఉన్న భూముల్లో భారీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న మౌనం వహించారని ఆరోపించారు.

నిషేధిత భూములకు పట్టా పాస్ పుస్తకాలు!

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని తంగడపల్లి, లింగోజిగూడెం, తూప్రాన్ పేట్, మల్కాపురం రెవెన్యూ గ్రామాలలో నిషేధిత జాబితాలో పేర్కొన్న భూములకు అప్పట్లో చౌటుప్పల్ ఆర్డీవో, జిల్లా కలెక్టర్ సహకారంతో పట్టా పాస్ పుస్తకాలు జారీ చేశారు. దీంతో వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములతో పాటు నిషేధిత భూములు అన్యాక్రాంతం అయ్యేందుకు సహకరించారని ఆరోపించారు. కోర్టు పరిధిలో పెండింగ్ ఉన్న భూములకు సైతం పట్టా పాస్ పుస్తకాలు జారీ చేసి భారీగా ఆదాయాన్ని సొమ్ము చేసుకున్నారని వివరించారు. వ్యవసాయేతర భూములకు కూడా పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడంతో చౌటుప్పల్ రెవెన్యూ అధికారులు భారీగా సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. వాటన్నిటిపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పట్లో రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలతో ఇటీవల కొందరు రెవెన్యూ అధికారులతో పాటు అక్రమార్కులు కూడా జైలు ఊచలు లెక్కించాల్సి వచ్చింది. అయితే సదరు అక్రమాలలో కేవలం ఒకరిద్దరి రెవెన్యూ అధికారులను బలిచేసి అసలైన వారు తప్పించుకున్నారని ఆరోపణలు కూడా గుప్పుమంటున్నాయి.

నిష్పక్షపాత విచారణ జరిగేనా!

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఉండడంతో ఇక్కడ భూముల విలువలకు రెక్కలు వచ్చాయి. దీంతో పలువురు రెవెన్యూ అధికారులు అక్రమార్జన పై దృష్టి సారించడంతో వారికి అక్రమార్కులు కూడా తోడయ్యారు. ఇష్టానుసారంగా నిబంధనలను తుంగలో తొక్కి నకిలీ పత్రాలను సృష్టించే మరి పలు భూములకు డాక్యుమెంట్లను తయారు చేశారు. చౌటుప్పల్ మండల పరిధిలో అప్పట్లోనే వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ,వివాదాస్పద భూములు అన్యాక్రాంతం అయ్యేందుకు అధికారులు సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం వీటి విలువ వేల కోట్ల వరకు ఉంటుంది. చౌటుప్పల్ మండలంలో భూ లావాదేవీలలో జరిగిన అక్రమాలపై నిష్పక్షపాత విచారణ నిర్వహించి అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.

Next Story