Petrol : మూడో రోజూ సేమ్ సీన్ రిపీట్.. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ!

by Muthe.Rajitha |   (  Updated:2026-03-26 04:48:51  IST  )

హైదరాబాద్ నగరంలో బుధవారం ఉదయం నుంచే పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెట్రోల్ కోసం ఎగబడ్డారు.

Petrol : మూడో రోజూ సేమ్ సీన్ రిపీట్.. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ!
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో బుధవారం ఉదయం నుంచే పెట్రోల్ బంకుల వద్ద యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, మియాపూర్, ఎల్బీనగర్, ఓల్డ్ సిటీ, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్.. ఇలా నగరంలోని అన్ని ప్రాంతాలలో వాహనదారులు పెట్రోల్ కోసం ఎగబడ్డారు. తెల్లవారుజాము నుండే బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. చాలా చోట్ల పెట్రోల్ అయిపోయిందంటూ "No Stock" బోర్డులు దర్శనమివ్వడం ప్రజల ఆందోళనను మరింత పెంచింది. కొన్ని బంకుల్లో కేవలం డీజిల్ మాత్రమే అందుబాటులో ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దీని నియంత్రించడానికి ట్రాఫిక్ పోలీసులు భారీగా రంగంలోకి దిగవలసి వచ్చింది.

ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి(Strait of Hormuz) మూసివేయడంతో చమురు సరఫరా ఆగిపోయిందనే వార్తలు సోషల్ మీడియాలోగుప్పుమన్నాయి. రాబోయే రోజుల్లో పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతాయని, అసలు దొరకపోవచ్చనే భయంతో తమ వాహనాల ట్యాంకులను ఫుల్ చేసుకోవడానికి ఒక్కసారిగా జనం పెట్రోల్ బంకులపై ఎగబడ్డారు. అంతేకాదు అనేకమంది క్యాన్లలో, డ్రమ్ముల్లో నిల్వ చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఈ 'పానిక్ బయింగ్' కారణంగానే బంకుల్లో నిల్వలు అకస్మాత్తుగా ఖాళీ అయ్యాయని అధికారులు అంటున్నారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు తక్షణమే స్పందించాయి. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏమాత్రం లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. HPCL, IOCL, BPCL వంటి ప్రధాన కంపెనీల వద్ద తగినంత స్టాక్ అందుబాటులో ఉందని, సరఫరా సాధారణంగానే జరుగుతోందని ధృవీకరించింది. నగరంలోని 181 పెట్రోల్ బంకులలో పూర్తి స్థాయిలో నిల్వలు ఉన్నాయని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి ప్రకటించారు. సోషల్ మీడియాలో వస్తున్న అబద్ధపు వార్తలను నమ్మవద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రద్దీని నియంత్రించడానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

Read More : LPG కష్టాల నుంచి భారత్‌కు ఊరట.. అర్జెంటీనా ఆపన్నహస్తం

Next Story