- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

దిశ, ఖమ్మం : ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన మంత్రి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, వైద్య సదుపాయాలు, పరిశుభ్రత, ఔషధాల లభ్యత, వైద్యులు, సిబ్బంది పనితీరు, తదితర అంశాలపై వైద్య అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులతో నేరుగా మాట్లాడి అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ... రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి, వారి సహాయకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించారు. ఖమ్మం జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ భవనం పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. భవనం ప్రారంభోత్సవానికి ముందే ఆసుపత్రి ప్రాంగణంలో పారిశుధ్య నిర్వహణను మరింత పటిష్ఠం చేయాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆసుపత్రికి వచ్చే ప్రధాన రహదారికి ఇరువైపులా ఆకర్షణీయమైన మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి సూచించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఎక్కడా చెత్తాచెదారం లేకుండా పరిశుభ్ర వాతావరణం ఉండాలని, అంతర్గత రహదారులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచి గుంతలు లేకుండా అవసరమైన మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆసుపత్రుల్లో ప్రతి రోగి సంతృప్తి చెందే విధంగా సేవలు అందించాలని మంత్రి అన్నారు.
ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా విడివోస్ కాలనీలో ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించిన మంత్రి...
ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నియోజకవర్గంలోని విడివోస్ కాలనీలో కొనసాగుతున్న ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను మంత్రి పరిశీలించారు. ఇంటింటి సర్వే, వివరాల నమోదు ప్రక్రియ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని, నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా, వేగవంతంగా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు జాబితాలో నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ తనిఖీ సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాల్ల దుర్గాప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. నరేందర్, వైద్య శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.






