- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిర్యాదులపై తక్షణ స్పందనతో పాటు నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలి
నిజామాబాద్ నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని వివిధ రికార్డులు, పెండింగ్ కేసుల ఫైళ్లను పరిశీలించి కేసుల దర్యాప్తు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ కాలనీల్లోని సమస్యలను గుర్తించి పరిష్కరించేలా బీట్ అధికారులు చురుకుగా పనిచేయాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వ్యక్తుల కదలికలపై నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, గేమింగ్ యాప్‌ల కారణంగా యువత ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొంటూ వాటి పట్ల అప్రమత్తంగా ఉండేలా ప్రచారం చేపట్టాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలన కోసం యువతను నిరంతరం చైతన్యవంతులను చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణను కట్టుదిట్టం చేయడంతో పాటు ప్రతి కేసు దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు.
అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమైన కమిషనర్, అధికారులు, సిబ్బంది 24/7 ప్రధాన కార్యాలయ పరిధిలో అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ తనిఖీలో ఏసీపీ ప్రకాశ్ యాదవ్, త్రీ టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, ఎస్‌ఐలు హరిబాబు, నారాయణతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






