- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలి : కలెక్టర్ కుమార్ దీపక్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించే దిశగా అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు.

దిశ, జన్నారం : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించే దిశగా అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం జన్నారం మండలం అక్కపల్లిగూడ గ్రామంలోని మండల పరిషత్ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలను తహసీల్దార్ బక్కయ్య, ఎంపీడీఓ ఉమర్ షరీఫ్‌తో కలిసి కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న బోధనా విధానం, పాఠశాల రిజిస్టర్లు, వంటశాల, పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహారం అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అనంతరం పొనకల్ గ్రామంలోని భవిత వనరుల కేంద్రం, మండల పరిషత్ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల నమోదును పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కొనసాగుతున్న అదనపు తరగతి గదులు, మూత్రశాలలు, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో వంటశాల, ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కవ్వాల్ గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి తరగతి గదులు, పరిసరాలను పరిశీలించి విద్యార్థుల సంఖ్య పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ఓపీ రిజిస్టర్, వార్డులు, మందుల నిల్వలు, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణీలు, రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. తదుపరి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు పై సమీక్ష నిర్వహించారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ నెల 24వ తేదీలోగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తి చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి లబ్ధిదారులకు త్వరగా అందేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.






