EPFO: ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్.. జూలై 15కే పీఎఫ్ వడ్డీ జమ

by S Gopi |

సంస్థ కొత్తగా ప్రవేశపెట్టిన 'సైట్స్ 2.01' అనే సెంట్రలైజ్డ్ డిజిటల్ ఐటీ ప్లాట్‌ఫామ్ వల్ల ఈసారి అత్యంత వేగంగా, ఆటోమేటిక్‌గా వడ్డీ లెక్కింపు పూర్తవుతోంది.

EPFO: ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్.. జూలై 15కే పీఎఫ్ వడ్డీ జమ
X

దిశ, బిజినెస్ బ్యూరో: కోట్లాది మంది పీఎఫ్ చందాదారుల నిరీక్షణకు తెరదించుతూ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక వడ్డీ లెక్కింపు ప్రక్రియను రికార్డు వేగంతో ప్రారంభించింది. బుధవారం కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 34 కోట్ల మంది సభ్యుల ఖాతాల్లోకి ఈ నెల 15 నాటికే 8.25 శాతం వార్షిక వడ్డీ సొమ్ము (మొత్తం రూ. 1.44 లక్షల కోట్లు) నేరుగా జమ కానుంది. గతంలో ప్రభుత్వం ఆమోదం తెలిపాక కూడా వడ్డీ అకౌంట్లోకి రావడానికి అక్టోబర్ లేదా నవంబర్ వరకు నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ, సంస్థ కొత్తగా ప్రవేశపెట్టిన 'సైట్స్ 2.01' అనే సెంట్రలైజ్డ్ డిజిటల్ ఐటీ ప్లాట్‌ఫామ్ వల్ల ఈసారి అత్యంత వేగంగా, ఆటోమేటిక్‌గా వడ్డీ లెక్కింపు పూర్తవుతోంది. పాత డేటాబేస్ స్థానంలో వచ్చిన ఈ సరికొత్త వ్యవస్థతో, చందాదారులు తమ పీఎఫ్ ఆఫీసుతో సంబంధం లేకుండా దేశంలోని ఏ ప్రాంతం నుండైనా ఒకే క్లిక్‌తో ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్, క్లెయిమ్ స్టేటస్ చూసుకునే పారదర్శకత లభించింది.

అంతేకాకుండా చందాదారులకు మరింత ప్రయోజనం చేకూరేలా ఈపీఎఫ్ఓ పలు కీలక మార్పులు చేసింది. తుది సెటిల్‌మెంట్ సమయంలో చెల్లింపు ఆమోదం పొందిన తేదీ వరకు వడ్డీ లెక్కించనుండటంతో సభ్యులకు అదనపు లాభం లభించనుంది. పాక్షిక పీఎఫ్ ఉపసంహరణ నిబంధనలను కూడా సరళీకరించి, అనారోగ్యం, విద్య, వివాహం, గృహ అవసరాలు వంటి మూడు ప్రధాన విభాగాల కిందకు తీసుకొచ్చింది. అవసరమైతే పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం కల్పించింది. ఆధార్ అనుసంధానమైన యూఏఎన్ నంబర్ ఉన్న ఉద్యోగులు కంపెనీ మారినప్పుడు, పాత కంపెనీ పీఎఫ్ బ్యాలెన్స్ కొత్త కంపెనీ అకౌంట్‌లోకి ఎలాంటి దరఖాస్తులు లేకుండా ఆటోమేటిక్‌గా బదిలీ అయిపోతుంది. అలాగే, పెన్షన్ చెల్లింపులను కూడా దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ఖాతాలోనైనా జమ చేసేలా వ్యవస్థను విస్తరించింది. ఈ మార్పులతో ఈపీఎఫ్ఓ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా, చందాదారులకు అనుకూలంగా మారనున్నాయని అధికారులు చెబుతున్నారు.

Next Story