సోషల్ మీడియా దుష్ప్రచారంపై ఉక్కుపాదం

by velandi.Saikiran |

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ పోలీస్ శాఖ అత్యున్నత బాధ్యత అని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి అన్నారు.

సోషల్ మీడియా దుష్ప్రచారంపై ఉక్కుపాదం
X

దిశ, క్రైం, వనపర్తి:- ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ పోలీస్ శాఖ అత్యున్నత బాధ్యత అని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది క్రమశిక్షణ, సమయపాలన,బాధ్యతాయుతగా ఉంటూ... ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు.పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ... స్పందనాత్మక పోలీసింగ్‌ను అమలు చేయాలని జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..... ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ పోలీస్ శాఖ అత్యున్నత బాధ్యత అని అన్నారు. ఫిర్యాదుపై స్పందించి బాధితులకు న్యాయం, భరోసా కల్పించడం పోలీస్ శాఖ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఆకతాయిలు, ఈవ్‌టీజింగ్‌, ప్రజలకు ఇబ్బందులు కలిగించే వ్యక్తులు పై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. మహిళలు, విద్యార్థినులు, ప్రజలు నిర్భయంగా సంచరించే వాతావరణం కల్పించేందుకు షీ టీమ్స్, ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు.

సోషల్ మీడియా వేదికల్లో అసత్య ప్రచారాలు, తప్పుడు వార్తలు, వదంతులు, ప్రజలను రెచ్చగొట్టే పోస్టులు లేదా చట్టవ్యవస్థకు భంగం కలిగించే సందేశాలు ప్రచారం చేసే వ్యక్తులను గుర్తించి, సైబర్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, ఎలాంటి సమాచారం అయినా ధృవీకరించకుండా ఇతరులకు పంపవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా అత్యవసర సేవల నంబర్ 112కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ తనిఖీలో డీఎస్పీ గిరిబాబు,సీఐ సుగంధరత్నం, పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story