రెండేళ్లలో ఎన్నికలు.. వ్యూహాత్మక నియామకాలు

by Batti.Sumithra |

రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సహకార పదవుల భర్తీకి ప్రభుత్వం తెరలేపింది.

రెండేళ్లలో ఎన్నికలు.. వ్యూహాత్మక నియామకాలు
X

దిశ, కామారెడ్డి : రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సహకార పదవుల భర్తీకి ప్రభుత్వం తెరలేపింది. ఎన్నికలా.. నామినేషనా అనే సందిగ్ధతకు తెరపడింది. తొలిసారిగా రాష్ట్రంలో నామినేటెడ్ పద్ధతిలోనే పీఏసీఎస్ పాలకవర్గాలను నియమించాలని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కోలాహలం నెలకొంది.

కాంగ్రెస్‌లో మొదలైన పదవుల కోలాహలం..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు దక్కలేదన్న అసంతృప్తి శ్రేణుల్లో ఉండేది. ఇప్పుడు భారీ స్థాయిలో సహకార పదవులు భర్తీ కానుండడంతో ఆ అసంతృప్తులు తొలగనున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే 144 పీఏసీఎస్‌లు ఉండగా, వాటిలో 1,872 డైరెక్టర్ పదవులు ఉన్నాయి. నిజామాబాద్‌లో 89, కామారెడ్డిలో 55 సంఘాలున్నాయి. ఒకేసారి వేలాది పదవులు భర్తీ కానుండడంతో గ్రామస్థాయి నుంచి ఆశావహులు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. హైదరాబాద్ వరకు పైరవీలు సాగుతున్నాయి.

2025 డిసెంబర్‌లో రద్దు.. ఆపై కోర్టు తీర్పుతో తిరిగి కొనసాగింపు..

2025 డిసెంబర్ 19న ప్రభుత్వం ఒకే ఉద్దుటున డీసీసీ బ్యాంక్, పీఏసీఎస్‌ల పాలకవర్గాలను రద్దు చేసి అధికారులను పర్సన్-ఇన్‌చార్జిలుగా నియమించింది. దీనిపై పాలకవర్గాలు కోర్టును ఆశ్రయించగా, సానుకూల తీర్పుతో తిరిగి పదవుల్లో కొనసాగాయి. ఈ నేపథ్యంలో మార్చిలో జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రత్యేక జీవో ద్వారా నామినేటెడ్ పద్ధతిలోనే పదవులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రకారం ఇప్పుడు ప్రక్రియ వేగవంతమైంది.

సహకార చరిత్రలో ప్రప్రథమం..

ఇప్పటి వరకు పీఏసీఎస్ పాలకవర్గాలను ఎన్నికల ద్వారా గానీ, ఎన్నికైన కమిటీలు లేదా పర్సన్-ఇన్‌చార్జీల ద్వారా గానీ నిర్వహించేవారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలిసారిగా నామినేటెడ్ విధానంలో పాలకమండళ్లను ఏర్పాటు చేయనుంది. ఒక పీఏసీఎస్‌కు చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు 11 మంది డైరెక్టర్లు ఉండగా, మొత్తం 13 మందితో పాలకవర్గం కొలువుదీరుతుంది.

పీఏసీఎస్ పదవులు కీలకం.. అందుకే పోటీ..

రైతులకు రుణాలు, ఎరువులు, పంట రుణాలు, రైతు మేళాలు, ఇతర వ్యవసాయ సంబంధిత అంశాలన్నీ పీఏసీఎస్‌ల ద్వారానే జరుగుతాయి. అందుకే ఈ పదవులకు ప్రాధాన్యత ఎక్కువ. పదవి దక్కించుకుంటే గ్రామంలో పలుకుబడి పెరుగుతుందనే ఉద్దేశంతో నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, రెండేళ్లలో సాధారణ ఎన్నికలు ఉండడంతో మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి మరింత పెరిగింది.

పార్టీలో అసంతృప్తి తొలగింపే లక్ష్యం..

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా క్షేత్రస్థాయి కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదన్న అసంతృప్తి కాంగ్రెస్‌లో ఉంది. వేలాది సహకార పదవులను ఒకేసారి భర్తీ చేయడం ద్వారా ఆ అసంతృప్తిని తొలగించాలని అధిష్ఠానం భావిస్తోంది. నామినేటెడ్ విధానం వల్ల విధేయులకు అవకాశం ఇచ్చి పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉంటుందని నేతలు చెబుతున్నారు.

రెండేళ్లలో ఎన్నికలు.. వ్యూహాత్మక నియామకాలు..

వచ్చే రెండేళ్లలో స్థానిక సంస్థలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామస్థాయిలో పార్టీ పట్టు పెంచేందుకు పీఏసీఎస్ పదవులను వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. రైతులతో ప్రత్యక్ష సంబంధం ఉండే ఈ పదవుల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని నేతలు అంచనా వేస్తున్నారు.

కొలిక్కిరాని డీసీసీ బ్యాంక్ చైర్మన్ నియామకం..

పీఏసీఎస్‌లతో పాటు డీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి భర్తీపై కూడా ఆసక్తి నెలకొంది. దీనిని కూడా నామినేటెడ్ పద్ధతిలోనే భర్తీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే అధికారులు మాత్రం ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూడాల్సిందేనని అంటున్నారు. మొత్తంగా నామినేటెడ్ విధానంతో కాంగ్రెస్ శ్రేణులకు పదవులు దక్కనుండడంతో పార్టీలో ఉత్సాహం నెలకొంది.

Next Story