యూట్యూబ్‌లో చూసి 7 ఫ్లేవర్లలో వైన్‌ తయారీ.. వృద్ధుడు అరెస్ట్

by Naga Rani Yarlagadda |

యూట్యూబ్‌లో వీడియోలు చూసి, తన ఇంట్లోనే ఏకంగా ఒక మినీ వైన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన ఓ వృద్ధుడి వ్యవహారాన్ని మల్కాజ్‌గిరి ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు.

యూట్యూబ్‌లో చూసి 7 ఫ్లేవర్లలో వైన్‌ తయారీ.. వృద్ధుడు అరెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: యూట్యూబ్‌లో వీడియోలు చూసి, తన ఇంట్లోనే ఏకంగా ఒక మినీ వైన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన ఓ వృద్ధుడి వ్యవహారాన్ని మల్కాజ్‌గిరి ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. ఏడాది కాలంగా గుట్టుచప్పుడు కాకుండా.. ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా ఏడు రకాల ఫ్లేవర్లలో అక్రమంగా వైన్ తయారు చేస్తున్న ఆ నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసి, భారీగా నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను మల్కాజ్‌గిరి డీటీఎఫ్‌ సీఐ భరత్ కుమార్ మీడియాకు వెల్లడించారు. డీటీఎఫ్‌ సీఐ భరత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడ్‌మెట్‌ ప్రాంతానికి చెందిన ఆంటోనీ పీటర్ అనే వృద్ధుడు స్వయం ఉపాధి మార్గం కోసం వెతుకుతూ, చివరకు అక్రమంగా వైన్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం యూట్యూబ్‌లో వీడియోలు చూసి వైన్ తయారీని నేర్చుకున్నాడు. ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తన నివాసంలోనే ఏకంగా ఏడు రకాల ఫ్లేవర్లలో వైన్ తయారు చేయడం ప్రారంభించాడు.

సాధారణంగా ద్రాక్షతో చేసే వైన్‌కు భిన్నంగా.. పైనాపిల్, జామ, మోసంబీ, సపోటా, అరటి పండ్లతో పాటు వినూత్నంగా తమలపాకులతో కూడా వైన్ తయారు చేస్తూ అందరినీ విస్తుపోయేలా చేశాడు. పండ్లను చిన్న ముక్కలుగా కోసి, వాటిని సహజ సిద్ధంగా 15 రోజుల పాటు పులియబెట్టేవాడు. ఈ ప్రక్రియలో పండ్ల రసంతో పాటు ఆల్కహాల్ తయారవుతుందని, ఆ తర్వాత అందులో పంచదార, గోధుమలు కలిపి వడకట్టి వైన్‌ను సిద్ధం చేసేవాడని సీఐ భరత్ కుమార్ వివరించారు. ఇలా ఇంట్లోనే గుట్టుగా తయారు చేసిన వైన్‌ను 750 ఎంఎల్ ఖాళీ సీసాల్లో నింపి, ఒక్కో బాటిల్‌ను రూ. 300 చొప్పున విక్రయించేవాడు. నేరేడ్‌మెట్, సికింద్రాబాద్ ఎన్.హెచ్.ఓ, కాప్రా పరిసర ప్రాంతాల్లోని కస్టమర్లకు ఈ అక్రమ వైన్‌ను సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. గత ఏడాది కాలంగా ఈ దందా కొనసాగిస్తూ లక్షల్లో లాభాలు గడిస్తున్నట్లు తమ దర్యాప్తులో గుర్తించామన్నారు.

పక్కా సమాచారంతో ఎస్సై శ్రీనివాసరెడ్డి బృందంతో కలిసి బుధవారం నిందితుడి నివాసంపై ఆకస్మిక దాడి చేశామని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడుల్లో నిందితుడి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 377.7 లీటర్ల వైన్‌తో పాటు, 502 ఖాళీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భరత్ కుమార్ వెల్లడించారు. పట్టుబడిన వైన్ విలువ సుమారు రూ. 1.50 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడు ఆంటోనీ పీటర్‌ను అరెస్ట్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం కాప్రా ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ ఇటువంటి అక్రమ తయారీకి పాల్పడితే ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. కాగా, ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన డీటీఎఫ్ టీమ్‌ను మల్కాజ్‌గిరి డిప్యూటీ కమిషనర్ ప్రణవి, ఈఎస్ బి.హన్మంతరావు ప్రత్యేకంగా అభినందించారు.

Next Story