కుప్పకూలిన ఖతర్ ఆర్మీ హెలికాఫ్టర్.. ఆరుగురు మృతి.. ఇరాన్ పనేనా?

by Muthe.Rajitha |

ఖతర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కు చెందిన ఒక సైనిక హెలికాప్టర్ పర్షియన్ గల్ఫ్ సముద్ర జలాల్లో కుప్పకూలగా.. ఆరుగురు మరణించారు.

కుప్పకూలిన ఖతర్ ఆర్మీ హెలికాఫ్టర్.. ఆరుగురు మృతి.. ఇరాన్ పనేనా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఖతర్ ఆర్మ్డ్ ఫోర్సెస్(Qatari Armed Forces)కు చెందిన ఒక సైనిక హెలికాప్టర్ మార్చి 21న పర్షియన్ గల్ఫ్ సముద్ర జలాల్లో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఆరుగురు మరణించినట్లు ఖతర్ రక్షణ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలు అధికారికంగా ధృవీకరించాయి. హెలికాప్టర్ రొటీన్ ట్రైనింగ్ మిషన్‌లో ఉండగా సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం ఏడుగురు ఉండగా, ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలను కోస్ట్ గార్డ్, 'లెఖ్వియా' భద్రతా దళాలు వెలికితీశాయి. గల్లంతైన మరో వ్యక్తి కోసం సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో కేవలం ఖతర్ సైనికులే కాకుండా, టర్కీకి చెందిన వారు కూడా ఉండటం గమనార్హం. వీరు హెలికాప్టర్ శిక్షణ నిమిత్తం బోర్డులో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా సంతాపం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది.

ఇరాన్ పనేనా?

ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నడుస్తున్న తీవ్ర ఘర్షణల నేపథ్యంలో, ఈ హెలికాప్టర్ కూల్చివేతకు గురై ఉండవచ్చని సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వెలువడగా.. అయితే ఖతర్, టర్కీ ప్రభుత్వాలు ఈ వాదనలను ఖండించాయి. ఇది కేవలం ఒక ప్రమాదం మాత్రమేనని, ఎటువంటి శత్రువుల దాడులతో దీనికి సంబంధం లేదని స్పష్టం చేశాయి. మృతుల కుటుంబాలకు ఖతర్ ఎమీర్, టర్కీ ప్రభుత్వం తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి.

Next Story