పుతిన్‌ని ద్వేషిద్దాం సరే.. మరీ ఆ దేశాల సంగతి ఏమిటి..?

by Disha Web Desk 19 |
పుతిన్‌ని ద్వేషిద్దాం సరే.. మరీ ఆ దేశాల సంగతి ఏమిటి..?
X

దిశ, ఫీచర్స్: ఉక్రెయిన్‌పై సైనిక దాడిచేసి ఆ దేశ నగరాలను, జీవితాలను ధ్వంసం చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని ఇవాళ ప్రపంచం ద్వేషిస్తోంది నిజమే. పుతినే యుద్ధం, యుద్ధమే పుతిన్ అంటూ మానవజాతి ఏకైక రాక్షసుడిగా పుతిన్‌పై తీవ్ర దుష్ప్రచారం సాగిస్తున్నారు. కానీ, పశ్చిమ దేశాల్లోని మాస్ హంతకుల మాటేమిటి? ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని వధించిన జర్మన్లు, బ్రిటిష్ వలసవాదులు, ఫ్రెంచ్ వలసవాదులు, అమెరికన్ సామ్రాజ్యవాదులపై చరిత్ర ఎంత ద్వేషం ప్రదర్శించాలి?

ఒక్కొక్కడు మహా హంతకుడు అని శ్రీశ్రీ అన్నట్లుగా వీరి ఘనకార్యాలేంటో చూద్దాం మరి..

ఆఫ్రికాలో 3 లక్షలమంది నమీబియన్లను జర్మన్లు ఊచకోత కోసినప్పుడు వారిని యూరప్‌లో ఎవరూ ద్వేషించలేదు. కింగ్ లియోపోల్డ్ 21.5 లక్షలమందికి పైగా కాంగోలీస్ ప్రజలను చంపినప్పుడు యూరప్‌లో అతడినెవరూ ద్వేషించలేదు. బ్రిటిష్ వలసవాదులు బెంగాల్లో 50 లక్షల మంది ప్రజలను ఆకలిచావుల బారిన పడేసినప్పుడు వీరిని యూరప్‌లో ఎవరూ ద్వేషించలేదు.

ఫ్రెంచ్ వలవాదులు 20 లక్షలమంది అల్జీరీయన్ పౌరులను క్రూరంగా చంపినప్పుడు వీరిని యూరప్‌లో ఎవరూ ద్వేషించలేదు. జాత్యహంకారపు అమెరికన్ సామ్రాజ్యవాదులు జర్మనీపై కాకుండా జపాన్‌పై అణుబాంబులు పేల్చి 3 లక్షలమంది జపనీయులను ప్రత్యేకించి మహిళలు, పిల్లలను ఉన్నఫళంగా చంపేసినప్పుడు యూరప్‌లో ఎవరూ అమెరికన్ సామ్రాజ్యవాదులను ద్వేషించలేదు. అమెరికా, బ్రిటన్ పాలకులు ఇరాక్‌లో పది లక్షలమందిని ఊచకోత కోసి, 5 లక్షలమంది అభం శుభం తెలియని పిల్లలను వధించినప్పుడు యూరప్‌లో వీరిని ఎవరూ ద్వేషించలేదు.

మరి రష్యన్ అధ్యక్షుడు పుతిన్‌ని మాత్రమే ఇంతగా ఎందుకు యూరప్‌లో ద్వేషిస్తున్నారు ఎవరు దీనికి సమాధానం చెప్పాలి..

బ్రిటన్ ప్రధానుల్లో అత్యుత్తమ ప్రధాని అని పేరొందిన విన్స్టన్ చర్చిల్ అయిసాడ్ గాంగ్‌ను రిక్రూట్ చేశాడు. ఈ గ్యాంగ్ జర్మనీలో అడాల్ప్ హిట్లర్ కంటే జాత్యహంకారంలో తీసిపోదు. ఈ ఇద్దరు యూరోపియన్ల జాత్యహంకార స్థాయి ఒక్కటే. కానీ యూరోపియన్లు హిట్లర్ని మాత్రమే అంతగా ద్వేషించడానికి కారణం ఏమిటంటే మాస్ హత్యలు, మారణ కాండ, నిర్బంధ శిబిరాల్లో హత్యలు వంటివి హిట్లర్ పేరుతో ముడిపడి ఉన్నాయి. మరి అదేసమయంలో యూరోపియన్ పాలకులు అఫ్రిన్లు, అరబ్బులు, అల్జీరియన్స్, పాలస్తీనీయులు, భారతీయులు, వియత్నమీయులు వంటి ఆసియా దేశాల ప్రజల పట్ల అమానుష కృత్యాలకు పాల్పడ్డారు. కానీ యూరోపియన్లకే హిట్లర్ చుక్కలు చూపించాడు కాబట్టి హిట్లర్ అంటే యూరోపియన్లకు అంత ద్వేషం మరి.

ఒకవేళ వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై కాకుండా ఆఫ్రికన్ లేదా ఆసియన్ దేశంపై దాడి చేసి ఉంటే యూరప్‍లో దానిపట్ల సౌండే ఉండేది కాదు. ఇక తక్కిన పాశ్చాత్య దేశాల విషయం చెప్పనవసరం లేదు. ఈరోజు యూరోపియన్ దేశమైన ఉక్రెయిన్‌‌పై రష్యాదాడి చేసింది కాబట్టి రష్యన్లపై యూరప్ ఆంక్షలకు సిద్ధపడింది. పుతిన్ వారి స్వర్ణయుగ పాలనను బద్దలు చేసి రెడ్ లైన్‌ దాటేశాడని వీరి దుగ్ధ.

మానవ చరిత్రను చూసినట్లయితే, యూరోపియన్లలాగా, వారి విస్తరణ శక్తులైన అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల లాగా లక్షలాది అమాయకులను, నిస్సహాయులను ఏ జాతి కూడా చంపలేదు. ప్రత్యేకించి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలయితే వారు అడుగుపెట్టిన ప్రతిచోటా అక్కడి స్థానికులను నిర్మూలించేశారు. ఎందుకంటే తమతో పోలిస్తే వీరు అనాగరికులట. అందుకే వారి జాతినే నిర్మూలించి వారు భూములను తస్కరించారు. ఇదేవిధంగా వీరు ఇప్పుడు పాలస్తీనియన్లు, ఆప్ఘాన్లు, ఇరాకీలు, ఎమెన్లు, సిరియన్లను అనాగరికులుగా భావిస్తున్నారు.

గణాంకాలను బట్టి చూస్తే, గత 300 సంవత్సరాలుగా జరిగిన జాతి హత్యాకాండల్లో 90 శాతం యూరోపియన్ శక్తులు చేసినవే. అలాగే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చరిత్రలో జరిగిన అన్ని యుద్ధాల్లో 80 శాతం పైగా అమెరికా తలపెట్టినవే. ఈ యుద్ధాల్లో 3 కోట్ల మంది అమాయకులు, నిరాయుధులు వధించబడ్డారు.

చివరగా చెప్పాలంటే, ఆఫ్రికాతో సహా దక్షిణాది ప్రపంచం కలిసికట్టుగా నిలిచి తమ జనాభా అంతరించిపోకుండా కాపాడుకోవడానికి, పాశ్చాత్య దేశాల సామ్రాజ్యవాద అనాగరికుల ఘోర జాత్యహంకారాన్ని, మారణ కాండను, రక్త పిపాసను తుదముట్టించాల్సిన అవసరం ఉంది.



కొసమెరుపు..

అమెరికా, నాటోది ఆద్యంతం కపటస్వభావమే. వీరి చేతులు ఎప్పుడూ పరిశుద్ధంగా లేవు. ఆంక్షలు మాత్రమే రష్యన్ల కంటే వీటిని కాస్త ముందంజలో ఉంచాయి. అమెరికా, నాటోలు ఇప్పటికే తమ ప్రభావంతో ప్రయోజనం పొందాయి. రష్యన్లు 6 లేదా 7 దేశాల మద్దతును పొందగలిగితే, అవి రష్యా పక్షాన దృఢంగా నిలబడగలిగితే అప్పుడు అమెరికా, నాటో కూటములు భీతిల్లిపోతాయి. వాస్తవానికి అమెరికా, నాటోలు తామే బాధితులమన్నట్లుగా పోజు కొడుతూ రష్యన్లను ఆంక్షల పేరిట నానా బాధలకు గురిచేస్తూ, రష్యన్లనే దుష్ట ప్రజలుగా, క్రూరులుగా ప్రపంచానికి చూపిస్తున్నారు. కానీ అమెరికా, నాటోల తప్పులను, సాగించిన ఘోర కృత్యాలను చూడకుండా ప్రపంచమే అంధత్వంలోకి కూరుకుపోతే ఎలా?

గతంలో పశ్చిమదేశాలు లక్షలాది మానవుల హత్యలకు, విధ్వసానికి కారణమయ్యాయి కాబట్టి ఇప్పుడు ఉక్రెయిన్‌లో పుతిన్ సాగిస్తున్న విధ్వంసక చర్యలను, అమాయకుల హత్యలను సమర్థించాలని చెప్పడం ఈ కథనం ఉద్దేశం కాదు. ఒక దేశం లేదా కొన్ని దేశాలు యావత్ప్రపంచంపై దుష్ప్రవర్తనను కొనసాగిస్తూనే, మరొక దేశం దుష్ప్రవర్తన గురించి గొంతెత్తడంలోని కపటత్వం ఇక్కడ చర్చకు రావాలి. భౌగోళిక రాజకీయ వ్యూహంలో భాగంగా సామ్రాజ్యవాద దేశాలు ఆడుతున్న అసలు రాజకీయాలను పక్కనపెట్టి ఉక్రెయిన్‌పై దాడి చేసింది కాబట్టి రష్యా దోషి, పుతిని దోషి అంటూ ముద్రవేయడం గ్లోబల్ మీడియా కుట్ర తప్ప మరే వివేచన ఇలాంటి ప్రచారంలో లేదు, కనిపించదు కూడా.



Next Story

Most Viewed