ఎన్నికల ప్రక్రియలో సోషల్ మీడియా జోక్యం ప్రమాదకరం.. సోనియా గాంధీ

by Disha Web Desk 17 |
ఎన్నికల ప్రక్రియలో సోషల్ మీడియా జోక్యం ప్రమాదకరం.. సోనియా గాంధీ
X

న్యూఢిల్లీ: ఫేస్ బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా సంస్థలు భారత్ ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకోవడానికి ముగింపు పలకాలని కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి గ్లోబల్ కంపెనీలు దేశంలోని రాజకీయ నాయకులు వారి ప్రతినిధుల ద్వారా రాజకీయ కథనాలను, పరిణామాలను మలుస్తున్నాయని ఆమె ఆరోపించారు. బుధవారం లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సమస్యను లేవనెత్తిన సోనియా గాంధీ, భారత ఎన్నికల రాజకీయాల్లో సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు వ్యవస్థాగతంగా జోక్యం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముగింపు పలకాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేయడానికి సోషల్ మీడియాను వాడుకుంటున్న ధోరణులు ప్రమాదకరం అంటూ సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలోని ఎన్నికల ప్రక్రియలో పేస్ బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలు వ్యవస్థీకృతంగానే జోక్యం చేసుకుంటున్నాయని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే దీన్ని అనుమతించరాదని ఆమె పేర్కొన్నారు.

అంతర్జాతీయ సోషల్ మీడియా దిగ్గజ కంపెనీలు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాతినిధ్యం కల్పిచడం లేదని పదే పదే ప్రజల దృష్టికి వస్తోంది. అల్ జజీరా, ది రిపోర్టర్స్ కలెక్టివ్ ప్రకటించినట్లుగా పాలక బీజేపీకి అనుకూలమైన ఒప్పందాలను ఫేస్ బుక్ ఇప్పటికే ఆఫర్ చేసిందని, ఈ విషయానికి సంబంధించి విద్వేష ప్రసంగాల నిబంధనలను కూడా ఫేస్ బుక్ పక్కన పెట్టిందని సోనియా ఆరోపించారు. అదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న రాజకీయ పార్టీల స్వరాన్ని ఫేస్ బుక్ వంటి సంస్థలు అణిచివేస్తున్నాయని పేర్కొన్నారు. ఫేస్‌బుక్ వల్ల సామాజిక సామరస్యం కూడా దెబ్బతింటోందని, పాలక పార్టీకి అనుకూలంగా చేపడుతున్న ఇలాంటి విధానాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, భావోద్వేగాలతో కూడిన తప్పుడు సమాచార పంపిణీ వల్ల యువత, పెద్దల మనస్సులు కూడా కలుషితమవుతున్నాయని ఆమె ఆరోపించారు. ఫేస్ బుక్ వంటి సంస్థలకు ఇవన్నీ తెలిసినప్పటికీ వాటినుంచి లాభాలు పొందటానికే ప్రాధాన్యమిస్తున్నాయని పాక్షిక రాజకీయాలకు అతీతంగా మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవలసి ఉందని సోనియా గాంధీ నొక్కి చెప్పారు.


Next Story

Most Viewed