- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్లమెంటులో మరోసారి డీలిమిటేషన్ బిల్లు!
దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైన డీలిమిటేషన్ బిల్లు ప్రక్రియను మళ్లీ తెరపైకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైన నియోజకవర్గాల పునర్విభజన (Delimitation Bill) ప్రక్రియను మళ్లీ తెరపైకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గతంలో దక్షిణాది రాష్ట్రాల నుండి వ్యక్తమైన తీవ్ర వ్యతిరేకత, అలాగే పార్లమెంటులో తగినంత మద్దతు లభించకపోవడంతో తాత్కాలికంగా పక్కన పెట్టిన ఈ బిల్లును.. రానున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో (Monsoon Session) చట్టసభల ముందుకు తీసుకురావడానికి కేంద్రం ముమ్మర ప్రణాళికలు రచిస్తోందని జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈసారి ఎలాంటి రాజకీయ ప్రతిష్టంభన లేకుండా బిల్లును ఆమోదింపజేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రూపొందిస్తోందని సమాచారం. బిల్లుపై జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం సాధించడమే లక్ష్యంగా కేంద్రం ప్రాంతీయ పార్టీలతో అంతర్గత చర్చలు జరుపుతోంది. ముఖ్యంగా గతంలో ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన తమిళనాడుకు చెందిన DMK, పశ్చిమ బెంగాల్‌కు చెందిన TMC పార్టీల అధినేతలను, కీలక నేతలను ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే సంప్రదించినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇటీవల అంతర్గత సంక్షోభాలు, ఎన్నికల పరిణామాలతో సతమతమవుతున్న తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు కీలక ఎంపీలు ఈ బిల్లుపై సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, దక్షిణాది ప్రయోజనాలకు గండిపడకుండా కేంద్రం రూపొందించబోయే సవరించిన నూతన డ్రాఫ్ట్ బిల్లు (Revised Draft Bill) కోసం డీఎంకే శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం.
జనాభా ప్రాతిపదికన గనుక నియోజకవర్గాల పునర్విభజన చేపడితే.. గత కొన్ని దశాబ్దాలుగా జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్ సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంది. అదే సమయంలో జనాభా విపరీతంగా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్య భారీగా పెరుగుతుంది. దీనివల్ల కేంద్ర రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, ప్రాధాన్యత తగ్గిపోతుందనేది ఇక్కడి ప్రాంతీయ పార్టీల ప్రధాన ఆందోళన. ఈ ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా సీట్ల కేటాయింపుల్లో ప్రత్యేక ఫార్ములాను నూతన డ్రాఫ్ట్‌లో చేర్చబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు పార్లమెంటు ముందుకు వస్తే దేశ రాజకీయాల్లో మరిన్ని కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.






