నేటితో ముగియనున్న పూరీ రథయాత్ర

by Muthe.Rajitha |

ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ స్వామి వార్షిక రథయాత్ర ఉత్సవాలు అత్యంత పవిత్రమైన 'నీలాద్రి విజే' (Niladri Bije) ఘట్టంతో ఘనంగా ముగియనున్నాయి

నేటితో ముగియనున్న పూరీ రథయాత్ర
X

దిశ, వెబ్ డెస్క్ : ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ స్వామి వార్షిక రథయాత్ర ఉత్సవాలు అత్యంత పవిత్రమైన 'నీలాద్రి విజే' (Niladri Bije) ఘట్టంతో ఘనంగా ముగియనున్నాయి. బాహుడా యాత్ర అంటే రథయాత్రలో తిరుగు ప్రయాణం ముగిసి సింహద్వారానికి చేరుకున్న రథాల వద్దే వేచి ఉన్న త్రినాథులు.. సోమవారం సాయంత్రం వేళ తిరిగి శ్రీమందిర ప్రధాన గర్భగుడిలో కొలువుదీరనున్నారు. ఈ ఘట్టంతో ఆషాఢ మాసంలో ప్రారంభమైన మహా రథయాత్ర మహోత్సవాలు సంపూర్ణంగా ముగుస్తాయి.

దాదాపు తొమ్మిది రోజుల పాటు భక్తులకు రథాలపైనే దర్శనమిచ్చిన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి అమ్మవారితో పాటు చక్రరాజ సుదర్శనుడు ఒక్కొక్కరుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. తొలుత బలభద్రుడు, సుభద్రల విగ్రహాలను, ఆ తర్వాత అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీజగన్నాథుని విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రధాన ఆలయంలోని రత్న సింహాసనంపై ప్రతిష్ఠిస్తారు.

అయితే నీలాద్రి విజే రోజున ఒక ఆసక్తికరమైన ఘట్టాన్ని నిర్వహిస్తారు. రథయాత్రకు వెళ్లేటప్పుడు తనను వెంట తీసుకెళ్లలేదనే కోపంతో లక్ష్మీదేవి.. జగన్నాథ స్వామిని ఆలయ ప్రధాన ద్వారమైన 'జయవిజయ ద్వారం' వద్ద అడ్డుకుంటుంది. అప్పుడు స్వామివారు ఆమె కోపాన్ని శాంతింపజేయడానికి, తనను క్షమించమని వేడుకుంటూ ప్రసిద్ధ ఒరిస్సా మిఠాయి అయిన 'రసగుల్లాలను' (Rasagolla) నైవేద్యంగా సమర్పిస్తారు. లక్ష్మీదేవికి రసగుల్లాలను అందజేసి, ఆమెను ప్రసన్నం చేసుకున్న తర్వాతే స్వామివారు గర్భగుడిలోకి అడుగుపెడతారు. ఈ సంప్రదాయానికి ప్రతీకగానే ఒడిశాలో రసగుల్లాలకు అంత ప్రాధాన్యత లభించింది.

ఆషాఢ శుద్ధ ద్వితీయ నాడు ప్రారంభమై, నేత్రోత్సవం, గుండిచా యాత్ర, బాహుడా యాత్ర, అధర పణల రథోత్సవాలన్నీ విజయవంతంగా ముగిసి, స్వామివారు తిరిగి గర్భగుడికి చేరే ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించడానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి తరలివస్తారు. నీలాద్రి విజే పూర్తయిన తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో రథయాత్ర ఉత్సవాలు పూర్తిగా ముగిసిపోతాయి.

Next Story