కామన్ వెల్త్: వెయిట్ లిఫ్టింగ్ లో దేశానికి మరో పతకం

by Muthe.Rajitha |

2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ల పతకాల జోరు కొనసాగుతోంది.

కామన్ వెల్త్: వెయిట్ లిఫ్టింగ్ లో దేశానికి మరో పతకం
X

దిశ, వెబ్ డెస్క్ : 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ల పతకాల జోరు కొనసాగుతోంది. పురుషుల 65 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో తమిళనాడుకు చెందిన ముత్తుపాండి రాజా రజత పతకం సాధించి దేశానికి మరో గౌరవాన్ని అందించారు. తన కెరీర్‌లో తొలిసారిగా కామన్వెల్త్ గేమ్స్‌లో ప్రాతినిధ్యం వహించిన ఆయన, అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లోనూ ఆకట్టుకునే ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచి పతకాన్ని ముద్దాడారు.

పోటీల ప్రారంభంలో స్నాచ్ విభాగంలో ముత్తుపాండి తన మొదటి ప్రయత్నంలో 126 కేజీల బరువును ఎత్తడంలో విఫలమైనప్పటికీ, రెండో ప్రయత్నంలో అదే బరువును సునాయాసంగా ఎత్తి పుంజుకున్నారు. మూడో ప్రయత్నంలో 129 కేజీల బరువును ఎత్తలేకపోవడంతో స్నాచ్ రౌండ్‌ను 126 కేజీల వద్ద ముగించారు. కాగా, మలేషియాకు చెందిన అజ్నిల్ బిన్ బిడిన్ ముహమ్మద్ 133 కేజీలు ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ రికార్డుతో తొలి స్థానంలో నిలిచారు.

ఆ తర్వాత జరిగిన క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో ముత్తుపాండి మొదట 160 కేజీల బరువు ఎత్తడంలో పొరపాటు చేసినా, రెండో ప్రయత్నంలో దాన్ని విజయవంతంగా ఎత్తి కాసేపు కామన్వెల్త్ గేమ్స్ రికార్డును తన పేరిట లిఖించారు. అయితే మలేషియా లిఫ్టర్ అజ్నిల్ బిన్ బిడిన్ 162 కేజీలు ఎత్తి మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లడంతో, ముత్తుపాండి రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Next Story