రథయాత్రపై ఇస్కాన్ వాదన తప్పు : పూరీ జగన్నాథ్ ఆలయ కమిటీ

by Muthe.Rajitha |

పూరీ జగన్నాథుని రథయాత్రల నిర్వహణ విషయంలో ఇస్కాన్ సంస్థకు, పూరీ జగన్నాథ్ ఆలయ కమిటీకి మధ్య వివాదం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

రథయాత్రపై ఇస్కాన్ వాదన తప్పు : పూరీ జగన్నాథ్ ఆలయ కమిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : పూరీ జగన్నాథుని రథయాత్రల నిర్వహణ విషయంలో ఇస్కాన్ (ISKCON) సంస్థకు, పూరీ జగన్నాథ్ ఆలయ మేనేజ్‌మెంట్ కమిటీకి మధ్య వివాదం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. రథయాత్రలను ఎక్కడైనా, ఎప్పుడైనా యాదృచ్ఛికంగా నిర్వహించవచ్చన్న ఇస్కాన్ వాదనను పూరీ ఆలయ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ వాదన పూర్తి అబద్ధమని, ఇది సనాతన సంప్రదాయాలకు విరుద్ధమని తేల్చిచెప్పింది.

అసలు వివాదం ఏమిటి?

ఇస్కాన్ సంస్థ దేశ, విదేశాల్లో తమకు అనుకూలమైన సమయంలో జగన్నాథుని రథయాత్రలను నిర్వహిస్తోంది. ఇలా అకాల రథయాత్రలు నిర్వహించడం కూడా శాస్త్రసమ్మతమేనని ఇస్కాన్ ఇటీవల వాదించింది. ఇస్కాన్ చెబుతున్న ఈ వాదనను పూరీ టెంపుల్ కమిటీ పూర్తిగా ఖండించింది. జగన్నాథ రథయాత్రకు స్కంద పురాణం తదితర ప్రత్యేక శాస్త్రాలు, నిర్దిష్ట ఆచారాలు, కాల నియమాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఆషాఢ మాస శుక్ల పక్ష ద్వితీయ రోజున మాత్రమే జగన్నాథుని రథయాత్ర నిర్వహించడం వేలాది ఏళ్లుగా వస్తున్న ఆచారం. దీనికి భిన్నంగా, ఏడాదంతా ఇష్టమొచ్చిన సమయంలో నిర్వహించడం మహాపాపమని, అది శాస్త్రవిరుద్ధమని కమిటీ స్పష్టం చేసింది. ఒడిశాలోని పూరీలో జరిగే రథయాత్ర మాత్రమే అసలైనదని, అత్యంత పవిత్రమైనదని కమిటీ పేర్కొంది. భారత్ తోపాటు విదేశాల్లో ఇస్కాన్ వంటి సంస్థలు రథయాత్రలు నిర్వహించినా, వాటిని పూరీ ఆలయ నిబంధనలు, ఆచారాల మేరకే నిర్ణీత సమయంలో చేయాలని స్పష్టం చేసింది.

కోర్టుకు వెళ్లే యోచనలో హిందూ సంఘాలు

ఇస్కాన్ సంస్థ తమ సొంత నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా రథయాత్రలు చేయడం వల్ల పూరీ జగన్నాథుని మూల సంప్రదాయాలకు భంగం వాటిల్లుతోందని సంప్రదాయవాదులు, కళింగ మఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూరీ రథయాత్ర పవిత్రతను కాపాడుకునే దిశగానే ఆలయ కమిటీ ఈ కఠినమైన ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆధ్యాత్మిక వివాదం సోషల్ మీడియాలో, భక్త కోటిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇస్కాన్ తీరుపై ఒడిశా ప్రభుత్వానికి, న్యాయస్థానాలకు ఫిర్యాదు చేసే యోచనలో పలు హిందూ సంఘాలు ఉన్నట్లు సమాచారం.

Next Story