భూమి.. బతుకు.. భక్తి... వదిలి ఎక్కడికి పోవాలి..?

by Batti.Sumithra |

నల్లమల అడవి ఒడిలో ఉన్న చందంపేట మండలంలోని రేకులవలయం–పొగిళ్ల గ్రామాలు మరోసారి పునరావాస చర్చకు కేంద్రబిందువుగా మారాయి.

భూమి.. బతుకు.. భక్తి... వదిలి ఎక్కడికి పోవాలి..?
X

దిశ, చందంపేట : నల్లమల అడవి ఒడిలో ఉన్న చందంపేట మండలంలోని రేకులవలయం–పొగిళ్ల గ్రామాలు మరోసారి పునరావాస చర్చకు కేంద్రబిందువుగా మారాయి. ఇటీవల అటవీ, తదితర శాఖల అధికారులు గ్రామాల్లో సమావేశం నిర్వహించి కుటుంబాల వివరాలు సేకరించడంతో పునరావాస అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో గ్రామాల్లో ఒకటే చర్చ సాగుతోంది.

పునరావాసమా..? లేక మా గ్రామాలనే అభివృద్ధి చేస్తారా..?

రేకులవలయం దశాబ్దాల చరిత్ర కలిగిన పురాతన గ్రామం. ప్రస్తుతం అక్కడ సుమారు 200 మంది జనాభా, 150 మంది ఓటర్లు ఉన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపు ప్రాంతాల నుంచి వలస వచ్చిన కుటుంబాలతో ఏర్పడిన పొగిళ్ల గ్రామంలో సుమారు 1,500 మంది జనాభా, 1,200 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు గ్రామాల్లో కలిపి దాదాపు 2,000 మంది జనాభా నివసిస్తోంది.

వ్యవసాయమే జీవనాధారం...

ఈ రెండు గ్రామాల్లో కలిపి దాదాపు 2,000 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమి ఉంది. నల్లరేగడి నేలల్లో పత్తి, మిర్చి వంటి వాణిజ్య పంటలు సమృద్ధిగా పండుతాయి. పంటల సీజన్‌లో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూలీలు వచ్చి పనులు చేస్తుంటారు. చాలామంది రైతులకు ఐదు నుంచి పది ఎకరాల వరకు సాగుభూములు ఉండగా, వందల సంఖ్యలో పశువులు, గొర్రెలు, మేకలను పెంచుతూ వ్యవసాయం, పశుపోషణనే ప్రధాన జీవనాధారంగా కొనసాగిస్తున్నారు.

సొంత ఖర్చుతో తాగునీటి సౌకర్యం...

ప్రభుత్వం పై ఆధారపడకుండా గ్రామస్థులే లక్షల రూపాయలు వెచ్చించి నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్ నుంచి దాదాపు ఆరు కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించుకున్నారు. గ్రామంలోని 'మట్టేబాయి' బావి నీరు కొబ్బరి నీళ్లంత తియ్యగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే వైద్యం, విద్య, రవాణా వంటి మౌలిక సదుపాయాల కొరత మాత్రం ఇప్పటికీ వెంటాడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో చికిత్స కోసం 60 కిలోమీటర్ల దూరంలోని దేవరకొండకు వెళ్లాల్సి వస్తోంది.

భక్తితో ముడిపడిన గ్రామాలు...

రేకులవలయం–పొగిళ్ల గ్రామాల ప్రత్యేకత కేవలం వ్యవసాయం మాత్రమే కాదు. పురాతన శ్రీరామాలయం, శివాలయం, శ్రీ ఆంజనేయస్వామి ఆలయం, ఎల్లమ్మతల్లి దేవాలయాలు గ్రామస్థుల విశ్వాసానికి ప్రతీకలుగా నిలిచాయి. ఈ ఆలయాలు నాగార్జునసాగర్ వలసలకు ముందే ఉన్నాయని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ప్రతి శుభకార్యం, ప్రతి మొక్కు ఈ దేవాలయాలతోనే ముడిపడి ఉండటంతో వాటిని వదిలి వెళ్లడం కష్టమని గ్రామస్థులు అంటున్నారు.

రెండుగా చీలిన ప్రజాభిప్రాయం...

పునరావాసం పై గ్రామస్థుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు సగం మంది ప్రభుత్వం సారవంతమైన భూములు, ఇళ్లు, ఉపాధి అవకాశాలు, అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన పునరావాసం కల్పిస్తే వెళ్లేందుకు సిద్ధమని చెబుతున్నారు. మరో సగం మంది మాత్రం తమ వ్యవసాయం, పశుసంపద, దేవాలయాలు, ప్రశాంత జీవనాన్ని వదిలి వెళ్లబోమని స్పష్టం చేస్తున్నారు. మా గ్రామాలనే అభివృద్ధి చేసి, ఆసుపత్రి, పాఠశాల, రోడ్లు, తాగునీటి వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఇక్కడే గౌరవంగా జీవిస్తాం" అని వారు చెబుతున్నారు.

ఫారెస్ట్ శాఖ ఏమంటోంది...?

ఈ విషయం పై కంబాలపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి మాట్లాడుతూ పునరావాసం పూర్తిగా గ్రామస్థుల స్వచ్ఛంద నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఎవరినీ బలవంతంగా తరలించం. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని ప్రయోజనాలు కల్పిస్తాం. గ్రామాల్లోనే ఉండాలని నిర్ణయించుకుంటే వారి నిర్ణయాన్నే గౌరవిస్తాం" అని తెలిపారు.

సర్పంచ్ జయేందర్ అభిప్రాయం..

మాకు ఇక్కడే జీవనాధారం ఉంది. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తే గ్రామం వదిలి వెళ్లం. ఒకవేళ పునరావాసం కల్పించినా ఇక్కడ ఉన్నంత సారవంతమైన భూమి, ఉపాధి అవకాశాలు అక్కడ కూడా ఉండాలి. లేకపోతే మా భూములను, మా దేవాలయాలను, మా జీవన విధానాన్ని వదిలి వెళ్లడం చాలా కష్టం" అని సర్పంచ్ జయేందర్ పేర్కొన్నారు.

ప్రజల ప్రశ్న ఇదే...

మా భూములు... మా బతుకు... మా దేవాలయాలు... మా పూర్వీకుల జ్ఞాపకాలను వదిలి వెళ్లాలా...? లేక మా గ్రామాలనే అభివృద్ధి చేసి గౌరవంగా జీవించే అవకాశం కల్పిస్తారా.. అభివృద్ధి పేరుతో ప్రజల జీవనాధారం దెబ్బతినకుండా, వారి మనోభావాలను గౌరవిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని రేకులవలయం–పొగిళ్ల ప్రజలు కోరుతున్నారు. పునరావాసమా... లేక గ్రామాల అభివృద్ధేనా.. అనే ప్రశ్నకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఇప్పుడు రెండు గ్రామాల ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story