భూభారతి రీ సర్వేకు ప్రజల సహకారం అవసరం.. నంచర్లలో అవగాహన సమావేశం

by Jakkula.Mamatha |

మహమ్మదాబాద్ మండలంలోని నంచర్ల గ్రామంలో భూభారతి భూ రీ సర్వే కార్యక్రమం పై గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద విస్తృత అవగాహన సమావేశం నిర్వహించారు.

భూభారతి రీ సర్వేకు ప్రజల సహకారం అవసరం.. నంచర్లలో అవగాహన సమావేశం
X

దిశ, మహమ్మదాబాద్: మహమ్మదాబాద్ మండలంలోని నంచర్ల గ్రామంలో భూభారతి భూ రీ సర్వే కార్యక్రమం పై గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద విస్తృత అవగాహన సమావేశం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఎస్. గాయత్రి దేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పీఏసీఎస్ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి, ల్యాండ్ సర్వే(ఏడీ) అశోక్, తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ ఫాయాజ్ అహ్మద్, మహమ్మదాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎం నారాయణతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. భూభారతి రీ సర్వే కార్యక్రమం ద్వారా గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, రహదారులు, ఇతర ప్రజా ఆస్తుల సరిహద్దులను శాస్త్రీయంగా గుర్తించి భూ రికార్డులను పారదర్శకంగా రూపొందించడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలోని ప్రతి భూ యజమాని తన భూమిని తప్పనిసరిగా రీ సర్వే చేయించుకుని సర్వే బృందానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ ప్రక్రియతో భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గడమే కాకుండా భూ హక్కులకు స్పష్టత ఏర్పడుతుందని వివరించారు.

పేద రైతులను వేధించవద్దు: కేఎం నారాయణ

అనంతరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎం నారాయణ మాట్లాడుతూ.. నంచర్ల గ్రామంలోని సర్వే నంబర్–663 పరిధిలో ప్రభుత్వం గతంలో నిరుపేద రైతులకు సాగు కోసం భూములు కేటాయించిందని తెలిపారు. ఆ భూముల్లో రైతులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. అయితే ఇటీవల అటవీ శాఖ అధికారులు ఆ భూములను అటవీ భూములుగా పేర్కొంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గతంలో కేటాయించిన భూముల విషయంలో స్పష్టత తీసుకువచ్చి, సాగు చేస్తున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. పేద రైతుల హక్కులను పరిరక్షిస్తూ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

రైతులకు విత్తనాల పంపిణీ..

అవగాహన సమావేశం అనంతరం నంచర్ల గ్రామ రైతు వేదిక వద్ద రైతులకు వ్యవసాయ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులు నాణ్యమైన విత్తనాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పచ్చదనం పెంపొందించే లక్ష్యంతో గ్రామ ప్రజలకు ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. సర్పంచ్ గాయత్రి దేవి, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి మొక్కలు అందజేశారు. మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. భూభారతి రీ సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గ్రామస్థులందరూ సహకరించాలని అధికారులు పిలుపునిచ్చారు.

Next Story