- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల సహకారం అవసరం
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించి నగర పాలక సంస్థకు సహకరించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు.

దిశ, గోదావరిఖని : నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించి నగర పాలక సంస్థకు సహకరించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు. వార్డు సందర్శనలో భాగంగా శనివారం 10వ డివిజన్ రామ్‌నగర్‌లో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా 2ఏ ఇంక్లైన్ మోరీ వద్ద కాలువ పూడిక తొలగింపు పనులతో పాటు సమీపంలోని ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించే పనులను పర్యవేక్షించారు. వీధుల్లో రహదారికి అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడంతో పాటు రామాలయం వెనుక రహదారి మధ్యలో మురుగు నీరు నిలిచిపోయిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేయించారు. మురుగు నీరు ఎక్కడా నిల్వ లేకుండా కాలువలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ .. నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు నగర పాలక సంస్థ చేస్తున్న ప్రయత్నాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పారవేసి జరిమానాల బారిన పడవద్దని సూచించారు. నెలకు కేవలం రూ.50 చెల్లించి ఇంటి వద్దకు వచ్చే స్వచ్ఛ ఆటోకు చెత్త అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), నగర పాలక సంస్థ కమిషనర్ జె.అరుణశ్రీ మాట్లాడుతూ.. వర్షాకాలంలో అంటువ్యాధుల వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి పరిసరాలతో పాటు బయట కూడా నీరు నిల్వ లేకుండా పరిశుభ్రత పాటించాలని చెప్పారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని డివిజన్లలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం మేయర్ 2, 32, 33, 34, 49వ డివిజన్లలో పర్యటించి పలు సమస్యలను పరిశీలించారు. రోడ్లు, కాలువలపై ఉన్న ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులకు ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో వెంటనే యూజీడీ నిర్మించి సీసీ రోడ్లు వేయాలని సూచించారు. రాజేష్ థియేటర్ జంక్షన్ వద్ద రోడ్డు విస్తరణ, జంక్షన్ అభివృద్ధి పనుల కోసం విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్‌ను ఇతర ప్రాంతానికి మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే దెబ్బతిన్న రోడ్లకు ప్యాచ్‌వర్క్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు అడ్డాల గట్టయ్య, వెంగళ బాపు, తోట మమత, మెరుగు భూలక్ష్మి, స్వప్నప్రియ, నాయకులు విజయ్, కుమార్, అభిషేక్, భరత్, సాగి సంతోష్‌రావు, నగర పాలక సంస్థ టీపీఓ నవీన్, ఏఈ అన్వేష్, మీర్ తదితరులు పాల్గొన్నారు.






