పేకాటబెట్టింగ్‌ పై ఉక్కుపాదం

by Batti.Sumithra |

పేకాటబెట్టింగ్ల పై ఉక్కుపాదం మోపుతామని ప్రజలకు పోలీసుల పై నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌ సింగ్ తెలిపారు.

పేకాటబెట్టింగ్‌ పై ఉక్కుపాదం
X

దిశ, వెల్దుర్తి : పేకాటబెట్టింగ్ల పై ఉక్కుపాదం మోపుతామని ప్రజలకు పోలీసుల పై నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌ సింగ్ తెలిపారు. మంగళవారం వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా ఎఎస్పీ తనిఖీ చేశారు. అనంతరం వెల్దుర్తి స్టేషన్‌లోని రికార్డులు, పలురిజిస్టర్లు, కేసు డైరీలు, పెండింగ్‌ కేసుల వివరాలను పరిశీలించారు. ఆయా కేసుల దర్యాప్తు పురోగతిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌ కేసులను నిబంధనల ప్రకారం త్వరిత గతిన పరిష్కరించాలని ఎస్‌ఐ కర్ణాకర్‌రెడ్డికి సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణ, లాకప్‌ గదులు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బందితో సమావేశమై స్థానిక శాంతిభద్రతల పరిస్థితి పై సమీక్షించారు. నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

పేకాట, ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల పై ఉక్కుపాదం మోపాలని అదనపు ఎస్పీ ఆదేశించారు. నిర్వాహకులతో పాటు వాటిలో పాల్గొనే వారి పై కూడా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలన పై ప్రత్యేక దృష్టి సారించాలని, సైబర్‌ నేరాల నివారణకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ, దర్యాప్తులో కీలక ప్రయోజనం ఉంటుందని, వాటి ప్రాముఖ్యత పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ట్రాఫిక్‌ నిబంధనల పై ప్రజలకు అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను ఓపికగా విని సత్వరమే స్పందించాలని అదనపు ఎస్పీ సూచించారు. ప్రతి ఫిర్యాదు పై పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, పోలీసుల పై ప్రజల్లో నమ్మకం పెరిగేలా విధులు నిర్వహించాలని సూచించారు.

Next Story