అక్రమ క్రషర్‌కు అండదండలా..?

by Jakkula.Mamatha |

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామంలో కొనసాగుతున్న క్రషర్ వ్యవహారం మరోసారి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అక్రమ క్రషర్‌కు అండదండలా..?
X

దిశ, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామంలో కొనసాగుతున్న క్రషర్ వ్యవహారం మరోసారి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు గనుల శాఖ తమ రీజాయిండర్‌లో క్రషర్‌కు సంబంధించిన మైనింగ్ లీజు, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) అనుమతులు, ఇతర చట్టబద్ధ అనుమతులు ఉన్నాయని పేర్కొంటుండగా.. మరోవైపు క్షేత్రస్థాయిలో గ్రామస్తులు, రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో వివాదం మరింత ముదురుతోంది.

ఎన్ఓసీపై వీడని సందేహాలు..!

క్రషర్ ఏర్పాటుకు తిప్పాపూర్ గ్రామ పంచాయతీ నుంచి ఎన్ఓసీ జారీ అయిందా..? గ్రామ సభ తీర్మానం జరిగిందా..? అనే ప్రశ్నలు ఇప్పటికీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం గ్రామ పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా ‘మా గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి ఎన్ఓసీ ఇవ్వలేదు’ అని తెలిపినట్లు సమాచారం. మరోవైపు ఇదే క్రషర్ విషయంలో గతంలో అప్పటి పంచాయతీ కార్యదర్శి మూడు సార్లు నోటీసులు జారీ చేసిన విషయం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. దీంతో పంచాయతీ రికార్డులు, అనుమతులపై పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

నీటిపారుదల శాఖ రాళ్లపై ప్రశ్నల వర్షం..!

నీటిపారుదల శాఖకు సంబంధించిన గుట్టల్లో తవ్వకాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైల్వే లైన్ అలైన్‌మెంట్‌లో వచ్చిన రాక్ ఎంత..? ఆ రాక్‌ను ఎక్కడ వినియోగించారు..? ప్రభుత్వ శాఖలకు చెందిన రాళ్లు, కంకర వినియోగంపై పూర్తి వివరాలు వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. సంబంధిత శాఖలు ఇప్పటివరకు స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడంపై కూడా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

దుమ్ము, ధూళితో ప్రజల అవస్థలు..!

క్రషర్ నుంచి ఎగిసిపడుతున్న దుమ్ము ధూళితో సమీపంలోని పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని, శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్య పై పలుమార్లు ధర్నాలు, నిరసనలు, వినతి పత్రాలు సమర్పించినా సంబంధిత శాఖలు సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భారీ వాహనాలతో రోడ్లు ఛిద్రం..!

క్రషర్‌కు నిత్యం రాకపోకలు సాగిస్తున్న భారీ టిప్పర్లు, డంపర్లు, లారీల కారణంగా తిప్పాపూర్‌తో పాటు పరిసర గ్రామాల రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని స్థానికులు చెబుతున్నారు. రోడ్లపై భారీగా దుమ్ము, ధూళీ ఎగిసి పడుతుండటంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. ధుమ్ము కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే పరిస్థితులు నెలకొన్నాయని, సంబంధిత శాఖలు ఇప్పటికైనా స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

సామాన్యులకు కేసులు.. సంస్థపై చర్యలు లేవా..?

తిప్పాపూర్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలు నీటిపారుదల శాఖకు చెందిన కంకర, రాళ్లు తీసుకెళ్తే వెంటనే కేసులు నమోదు చేసే అధికారులు.. ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిమ సంస్థపై మాత్రం ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ‘సామాన్య ప్రజలకు ఒక న్యాయం.. ప్రభావశీల సంస్థలకు మరో న్యాయమా..?’ అంటూ గ్రామస్తులు నిలదీస్తున్నారు.

లోపాయికారీ ఒప్పందాలున్నాయా..?

ప్రతిమ సంస్థకు, నీటిపారుదల శాఖ, గనుల శాఖ అధికారుల మధ్య ఏవైనా లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయా..? ఉంటే వాటి స్వరూపం ఏమిటి..? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలపై స్వతంత్రంగా సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

రీజాయిండర్‌లో ఒకలా.. క్షేత్రస్థాయిలో మరోలా..!

గనుల శాఖ సమర్పించిన రీజాయిండర్‌లో అన్ని అనుమతులు నిబంధనల ప్రకారమే ఉన్నాయని పేర్కొంది. అయితే క్షేత్ర స్థాయిలో గ్రామ పంచాయతీ ఎన్ఓసీపై భిన్న వాదనలు వినిపిస్తుండటం, గ్రామ సభ తీర్మానం పై స్పష్టత లేకపోవడం, నీటిపారుదల శాఖకు సంబంధించిన అంశాలపై సందేహాలు కొనసాగుతుండటం, దుమ్ము, ధూళితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతుండటం, భారీ వాహనాలతో రహదారులు దెబ్బతిన్నాయనే ఫిర్యాదులు రావడంతో ‘రీజాయిండర్‌లో ఒకలా.. క్షేత్రస్థాయిలో మరోలా..!’ అనే చర్చ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సాగుతోంది.

గనుల శాఖ వివరణతో సందేహాలకు తెరపడిందా..?

గనుల శాఖ తమ వివరణలో అన్ని అనుమతులు చట్టబద్ధంగా ఉన్నాయని పేర్కొన్నప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్ఓసీ, గ్రామ సభ తీర్మానం, నీటిపారుదల శాఖ భూముల వినియోగం, రైల్వే అలైన్‌మెంట్ రాక్, పర్యావరణ నిబంధనల అమలు, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం వంటి అంశాలపై సంబంధిత శాఖలు సమగ్ర విచారణ జరిపి పూర్తి వివరాలను వెల్లడించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

జిల్లా కలెక్టర్ స్పందిస్తారా..?

తిప్పాపూర్ క్రషర్ వ్యవహారంలో వస్తున్న ఆరోపణలు, ప్రజల ఫిర్యాదులు, రైతుల ఆందోళనలు, దుమ్ము, ధూళితో ఏర్పడుతున్న ఇబ్బందులు, రహదారుల దుస్థితి, గ్రామ పంచాయతీ ఎన్ఓసీపై నెలకొన్న సందేహాలు, నీటిపారుదల శాఖ భూములపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశిస్తారా..? అన్ని శాఖల నుంచి నివేదికలు తెప్పించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తారా..? ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల పాత్రపై దర్యాప్తు జరిపి, నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటారా..? లేక ఈ వ్యవహారం కూడా గత ఫిర్యాదుల మాదిరిగానే ఫైళ్లకే పరిమితమవుతుందా..? అనేది ఇప్పుడు జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Next Story