సూర్యతో చేయాల్సిన సినిమా అది కాదు.. అసలు విషయం చెప్పిన వెంకీ అట్లూరి

by Pulgam srinivas |

సూర్యతో మొదట బయోపిక్ చేయాలనుకున్నానని, అది కుదరకపోవడంతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' కథను చెప్పానని వెంకీ అట్లూరి చెప్పారు.

సూర్యతో చేయాల్సిన సినిమా అది కాదు.. అసలు విషయం చెప్పిన వెంకీ అట్లూరి
X

దిశ, వెబ్ డెస్క్: టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్య హీరోగా, మమిత బైజు హీరోయిన్‌గా తెరకెక్కుతున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా వెంకీ అట్లూరి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, సూర్యతో సినిమా ప్రారంభం కావడానికి ముందు జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. "ప్రస్తుతం నేను సూర్య గారితో 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా చేస్తున్నాను. కానీ మొదట ఈ కథను చేయాలనుకోలేదు. ముందుగా ఓ బయోపిక్ చేయాలనే ఆలోచనతో ఒక కథను ఆయనకు వినిపించాను.

ఆ కథ సూర్య గారికి బాగా నచ్చింది. అయితే అప్పటికే రెండు బయోపిక్‌లు చేసి ఉండడంతో, మళ్లీ అలాంటి సినిమా చేయడం సరైనది కాదని ఆయన భావించారు. ఆ తర్వాత 'వేరే కథ ఉంటే చెప్పు.. చేద్దాం' అన్నారు. దాంతో 40 ఏళ్ల వయసున్న, పిల్లలు ఉన్న వ్యక్తికి.. 20 ఏళ్ల యువతికి మధ్య ఉండే బంధం, భావోద్వేగాల నేపథ్యంలో సాగే కథను చెప్పాను. అదే 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఆ కథ ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి అంగీకరించారని తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

Next Story