మంత్రుల పర్యటనలు ఉంటేనే రోడ్లకు మోక్షమా..? ప్రజల తిప్పలు పట్టవా?

by Jakkula.Mamatha |

మంత్రుల పర్యటన ఉంటేనే రోడ్లకు మోక్షం అన్నచందంగా ఉంది అధికారుల తీరు.

మంత్రుల పర్యటనలు ఉంటేనే రోడ్లకు మోక్షమా..? ప్రజల తిప్పలు పట్టవా?
X

దిశ, మణుగూరు: మంత్రుల పర్యటన ఉంటేనే రోడ్లకు మోక్షం అన్నచందంగా ఉంది అధికారుల తీరు. నెలల తరబడి మణుగూరు ఏటూరు నాగారం ప్రధాన రహదారి, బస్టాండ్ వద్ద ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా చేశారు. ముందుగా అధికారుల సమన్వయం లోపంతో ప్రధాన రహదారి ప్యాచ్ వర్క్ చేసి వారం కాకముందే.. భగత్ సింగ్ నగర్ నుంచి ప్రధాన రహదారిని దాటుకుంటూ మిషన్ భగీరథ పైప్ లైన్ వేయడం కోసం మళ్ళీ వేసిన ప్యాచ్ వర్క్ ను జేసిబి తో తవ్వారు. పైప్ లైన్ వేసి గుంతలో కంకర కలిపిన వెట్మిక్స్ ను పోసి వదిలేశారు. ఇప్పుడు గత వారం రోజుల పరిధిలో మంత్రుల పర్యటన నేపథ్యంలో అప్పటికప్పుడు హడావుడిగా రోడ్ల గుంతలను పూడ్చడం పరమావదిగా మారింది. ప్రజల ఇబ్బందులతో అధికారులకు పనిలేదు అంటూ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఎన్ని రోజులుగా ప్రజలు గుంతల రోడ్లలో ప్రయాణం చేస్తూ నరక యాతన అనుభవించిన సరే అది మాత్రం అధికారుల కంటికి కానరాలేదు. ఎంతో మంది రోడ్ల పై ఉన్న గుంతల్లో పడి గాయాల పాలైన సంఘటనలు చాలా ఉన్నాయి. అప్పుడు గుర్తుకు రాని మరమ్మతులు మంత్రుల పర్యటన ఉండగానే గుర్తుకు రావడం ఏంటి అని ప్రజలు మండిపడుతున్నారు. వారి మెప్పు కోసం హడావుడిగా గుంతలను నామ మాత్రంగా పూడుస్తారు కానీ అవి వారం పది రోజులకే మళ్లీ గుంతలుగా ఏర్పడతాయి. అప్పుడు ఏ ఒక్క అధికారి కూడా ఇటువైపు కన్నెత్తి చూడరు. ఇంత విసిగిపోయిన ప్రజలు వీరు తీరు ఇంతే అన్నట్లుగా పట్టించుకోవడం మానేశారు. ఇప్పటికైనా గొప్పల కోసం కాకుండా ప్రజల కోసం పని చేయాలని పలువురు వాపోతున్నారు.

Next Story