అధిక ఫీజులు, అనుమతులు లేకుండా పుస్తకాల విక్రయంపై నిరసన

by Ratna Kumari |

కోదాడ పట్టణంలోని అక్షర స్కూల్ ఎదుట బుధవారం విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.

అధిక ఫీజులు, అనుమతులు లేకుండా పుస్తకాల విక్రయంపై నిరసన
X

దిశ, కోదాడ : కోదాడ పట్టణంలోని అక్షర స్కూల్ ఎదుట బుధవారం విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండానే పుస్తకాలను విక్రయిస్తోందని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించిన విద్యార్థి సంఘాల నాయకులపై నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారని వారు ఆరోపించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాఠశాల వద్దకు చేరుకుని వివరణ కోరగా, యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. ప్రశ్నించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

దీంతో పెద్ద సంఖ్యలో విద్యార్థి సంఘాల కార్యకర్తలు స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న కోదాడ మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం పాఠశాలలో తనిఖీలు నిర్వహించగా, పెద్ద మొత్తంలో పుస్తకాలు నిల్వ ఉంచినట్లు గుర్తించినట్లు సమాచారం. పుస్తకాల విక్రయానికి సంబంధించిన అనుమతులు, రికార్డులపై అనుమానాలు వ్యక్తం కావడంతో వాటిని పరిశీలించే వరకు సంబంధిత గదులకు ఎంఈఓ తాళాలు వేసినట్లు తెలిసింది.

విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని మండిపడ్డారు. అధిక ఫీజులు, బలవంతపు పుస్తకాల విక్రయాలపై జిల్లా విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్షర స్కూల్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు, ఎంఈఓ తనిఖీల అనంతరం పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు సమాచారం. విచారణ పూర్తయ్యే వరకు పుస్తకాల విక్రయం, ఫీజుల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

Next Story