సమీక్షకు రాని బ్యాంకర్లపై అదనపు కలెక్టర్ ఆగ్రహం

by velandi.Saikiran |

బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మార్చి 2026 కాలానికి సంబంధించిన డీసీసీ, డీఎల్ఆర్సీ సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమీక్షకు రాని బ్యాంకర్లపై అదనపు కలెక్టర్ ఆగ్రహం
X

దిశ, మేడ్చల్ బ్యూరో: జిల్లా స్థాయి డీసీసీ , డీఎల్ఆర్సీ సమావేశాలకు బ్యాంకర్లందరూ తప్పనిసరిగా హాజరు కావాలని, నిర్లక్ష్యం వహిస్తే తీవ్రంగా పరిగణిస్తామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ (ఐఏఎస్) హెచ్చరించారు. హాజరుకాని బ్యాంకులపై చర్యల కోసం రిజర్వ్ బ్యాంకు, రాష్ట్ర బ్యాంకుల కంట్రోలర్లు, రాష్ట్ర స్థాయి బ్యాంకుల కమిటీ చైర్మన్‌కు లేఖలు రాస్తామని స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మార్చి 2026 కాలానికి సంబంధించిన డీసీసీ, డీఎల్ఆర్సీ సమీక్షా సమావేశం నిర్వహించారు.

విద్యా రుణాల మంజూరు పై అసంతృప్తి

గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు రూ. 82,487 కోట్ల వార్షిక రుణ లక్ష్యం నిర్దేశించగా.. బ్యాంకులు రికార్డు స్థాయిలో రూ. 1,86,975 కోట్ల రుణాలు మంజూరు చేయడం పట్ల అదనపు కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బ్యాంకర్లను, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ను ఆయన అభినందించారు. గతేడాది వ్యవసాయ రంగంలో రూ. 2,996.65 కోట్ల లక్ష్యానికి గాను రూ. 6,173.60 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగంలో రూ. 23,042 కోట్ల లక్ష్యానికి గాను రూ. 23,490 కోట్లు, గృహ రుణాల విభాగంలో రూ. 15,593 కోట్ల లక్ష్యానికి గాను రూ. 16,248.48 కోట్లు సాధించినట్లు వెల్లడించారు. అయితే విద్యా రుణాల విభాగంలో రూ. 801.41 కోట్ల లక్ష్యానికి గాను కేవలం రూ. 430.07 కోట్లు మాత్రమే సాధించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇకపై విద్యా రుణాల మంజూరును మరింత సమర్థవంతంగా వేగవంతం చేయాలని ఆదేశించారు.

కొత్త రుణ ప్రణాళిక రూ. 95,163 కోట్లు

నాబార్డ్ వారి 'పొటెన్షియల్ క్రెడిట్ లింక్ ప్లాన్' ప్రకారం.. వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు రూ. 95,163 కోట్లతో కొత్త వార్షిక రుణ ప్రణాళికను కేటాయించినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రాధాన్యత రంగం కు రూ. 33,290 కోట్లు, వ్యవసాయ రంగం కు రూ. 3,056 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగంకు రూ. 27,882 కోట్లు, విద్యా రుణాలు రూ. 325 కోట్లు, గృహ నిర్మాణం కోసం రూ. 1,410 కోట్లు ఇతర ప్రాధాన్యత రంగాలుకు రూ. 2,292 కోట్లు గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌బీఐ ఏజీఎం అండ్ ఎల్‌డీవో హేమలత, నాబార్డ్ డీడీఎం ఝాన్సీ రాణి, లీడ్ బ్యాంక్ (కెనరా బ్యాంక్) జిల్లా కంట్రోలర్ ఏజీఎం అనురాగ్ ప్రకాష్, వివిధ బ్యాంకుల కంట్రోలర్లు, డీఐసీ, వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, డీసీవో, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు, ఎఫ్‌ఎల్‌సీ, సీఎఫ్‌ఎల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Next Story