- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల బలోపేతమే లక్ష్యం..ఆరోగ్య సూచీలపై మంత్రి సమీక్ష
రాష్ట్రంలోని అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందేనని ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.. అడవులు, కొండలు, దూర ప్రాంతాలు, రవాణా సమస్యలు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అడ్డంకులు కాకూడదన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందేనని ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.. అడవులు, కొండలు, దూర ప్రాంతాలు, రవాణా సమస్యలు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అడ్డంకులు కాకూడదన్నారు. వర్షాకాలం మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, హాస్పిటళ్లలో సౌకర్యాలు, ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎదురవుతున్న సవాళ్లు, తదితర అంశాలపై హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో బుధవారం మంత్రి సమీక్ష చేశారు. ఐటీడీఏ ప్రోగ్రామ్ ఆఫీసర్లతో గతంలో చేసిన రివ్యూలో తీసుకున్న నిర్ణయాల అమలుపై మంత్రి ప్రత్యేకంగా ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని హాస్పిటళ్ల అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, తమకు ఎదురు అవుతున్న వివిధ రకాల సవాళ్లను అధికారులు మంత్రికి వివరించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు, మాతా, శిశు సంరక్షణ, సీజనల్ వ్యాధుల నియంత్రణ, అత్యవసర వైద్య సేవలు, డయాలసిస్, క్యాన్సర్ స్క్రీనింగ్, సికిల్ సెల్ నియంత్రణ తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
సీజనల్ వ్యాధు నియంత్రణకు ముందస్తు చర్యలు...
వర్షాకాలంలో గిరిజన ప్రాంతాల్లో మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాలు, డయేరియా వంటి సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మందులు, డయాగ్నస్టిక్ కిట్లు, ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైన వైద్య పరికరాలు ప్రతి హాస్పిటల్‌లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు గ్రామ స్థాయిలోనే వైద్య సేవలు అందించాలని సూచించారు. 108, 102 అంబులెన్స్ సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవల గుండాల పీహెచ్‌సీలో జరిగిన మెటర్నల్ డెత్ ఘటన నుంచి ప్రతి అధికారి పాఠాలు నేర్చుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి నిరంతర పర్యవేక్షణలో ఉంచాలని, డెలివరీ డేట్ కంటే ముందుగానే, బర్త్ వెయిటింగ్ రూమ్స్‌కు తరలించాలని ఆదేశించారు. మాతా, శిశు సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు. మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న గిరిజన ప్రాంతాల ప్రజలకు చికిత్స మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను మంత్రి సమీక్షించారు. ప్రస్తుతం ఏజెన్సీ జిల్లాల్లో 25 డయాలసిస్ సెంటర్ల ద్వారా 1,373 మంది యాక్టివ్ రోగులు చికిత్స పొందుతున్నట్లు అధికారులు వివరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా 170 మిషన్లతో మరో 34 డయాలసిస్ సెంటర్లను మంజూరు చేశామని మంత్రి గుర్తు చేశారు. అలాగే, ఎమర్జన్సీ డయాలసిస్ సేవల కోసం ఏజెన్సీ ప్రాంతాల్లోని 12 హాస్పిటళ్లలో అదనంగా 37 డయాలసిస్ మిషన్లను మంజూరు చేస్తున్నామన్నారు. కొత్త డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు త్వరగా పూర్తయ్యేలా ఆరోగ్యశాఖతో పాటు, ఐటీడీఏ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ చొరవ తీసుకోవాలని మంత్రి సూచించారు.
ఏజెన్సీ గురుకులాలను ఆసుపత్రులతో అనుసంధానం చేయాలి...
ఏజెన్సీ ప్రాంతాల్లోని గురుకులాలను సమీపంలోని హాస్పిటళ్లకు అనుసంధానం చేయాలని గతంలో మంత్రి సూచించగా, ఈ సమీక్షలో అధికారులు మంత్రికి మ్యాపింగ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గిరిజన, ఎస్సీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను సమీప ప్రభుత్వ హాస్పిటళ్లతో అనుసంధానం చేసిన ప్రత్యేక మ్యాపింగ్‌ను మంత్రి సమీక్షించారు. దీనివల్ల అవసరమైన సందర్భంలో విద్యార్థులకు వేగంగా వైద్య సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. హాస్పిటల్ నుంచి 20 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న విద్యాసంస్థలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, అత్యవసర రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.
గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్, తలసీమియా, రక్తహీనత, క్షయ వ్యాధి నియంత్రణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని మంత్రి ఆదేశించారు. మొబైల్ యూనిట్ల ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలను విస్తరించడంతో పాటు క్యాన్సర్ నోటిఫికేషన్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. గ్రామాలు, తండాలు, ఆశ్రమ పాఠశాలలు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను నిరంతరం సందర్శిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, డీఎఈ డా.నరేంద్ర కుమార్, డీహెచ్ డా.రవీంద్ర నాయక్, ఐటీడీఏ ప్రోగ్రామ్ ఆఫీసర్లు రాహుల్, మకరంద్, లెనిన్, ట్రైబల్ వెల్ఫేర్, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న అధికారులు పాల్గొన్నారు.






