టీజీ ఈఏపీసెట్ 2026: రేపటి నుంచే వెబ్ ఆప్షన్ల నమోదు

by Kema Shiva Kumar |

టీజీ ఈఏపీసెట్ 2026 మొదటి విడత ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది.

టీజీ ఈఏపీసెట్ 2026: రేపటి నుంచే వెబ్ ఆప్షన్ల నమోదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీ ఈఏపీసెట్-2026 (TG EAPCET) ఇంజనీరింగ్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు రేపటి నుంచి జూలై 1వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, కౌన్సెలింగ్ కన్వీనర్ ఎ. శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. ధృవీకరణ పత్రాల పరిశీలనకు జూన్ 29 వరకు అవకాశం కల్పించారు. ఈ ఏడాది కౌన్సెలింగ్ కోసం ఇప్పటివరకు 84,002 మంది అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోగా, వీరిలో 36,393 మంది అభ్యర్థులు ఇప్పటికే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. స్లాట్ బుక్ చేసుకున్న వారిలో.. టాప్ 5,000 ర్యాంకుల్లో 2,793 మంది, 5,001 నుండి 20,000 లోపు ర్యాంకులు సాధించిన వారు 11,841 మంది అభ్యర్థులు ఉన్నారు.

175 ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం 1,14,007 సీట్లు

రాష్ట్రవ్యాప్తంగా 175 కాలేజీల్లో కౌన్సెలింగ్‌కు అందుబాటులో మొత్తం 1,14,007 సీట్లు ఉండగా, అందులో కన్వీనర్ కోటా కింద 81,620 సీట్లు ఉన్నాయి. విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని 22 కాలేజీల్లో మొత్తం 6,046 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో జేఎన్‌టీయూహెచ్ పరిధిలో అత్యధికంగా 3,150 సీట్లు, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 630 సీట్లు, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 780 సీట్లు ఉన్నాయి. రెండు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో మొత్తం 1,800 సీట్లు ఉండగా, అందులో 1,260 సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు. ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ కాలేజీలకు సంబంధించి 151 ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం 1,06,161 సీట్లు ఉండగా, వాటిలో 74,314 సీట్లు కన్వీనర్ కోటా కింద అందుబాటులో ఉన్నాయి.

కంప్యూటర్ సైన్స్ గ్రూపులదే హవా..

విద్యార్థుల క్రేజ్‌కు తగ్గట్టుగానే ఈసారి కూడా కంప్యూటర్ సైన్స్, ఐటీ అనుబంధ కోర్సుల్లోనే అత్యధిక సీట్లు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఐటీ అనుబంధ కోర్సులకు సంబంధించి మొత్తం 81,768 సీట్లు అందుబాటులో ఉండగా, అందులో కన్వీనర్ సీట్లు 58,038 ఉన్నాయి. ఇందులో కేవలం సీఎస్ఈ (CSE) బ్రాంచ్‌లోనే అత్యధికంగా 27,431 కన్వీనర్ సీట్లు ఉండగా, సీఎస్ఈ ఏఐఎంఎల్ (CSE AIML) లో 13,537 సీట్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ గ్రూపులలో మొత్తం 21,896 సీట్లు ఉండగా.. అందులో కన్వీనర్ సీట్లు 15,795 ఉన్నాయి. ఇందులో ఈసీఈ (ECE) లోనే 10,851 సీట్లు ఉన్నాయి. సివిల్, మెకానికల్, తదితర అనుబంధ కోర్సులకు మొత్తం 9,310 సీట్లు ఉంటే, అందులో 6,871 కన్వీనర్ సీట్లు ఉన్నాయి. ఇతర ఇంజనీరింగ్ కోర్సులలో మొత్తం 1,033 సీట్లు ఉండగా, కన్వీనర్ సీట్లు 916 వరకు ఉన్నాయి.

వెబ్ ఆప్షన్లు ఇచ్చే సమయంలో విద్యార్థులు తమ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్, ఓటీపీ, మొబైల్ నంబర్ వివరాలను ఎవరికీ చెప్పకూడదని కన్వీనర్ సూచించారు. మొదటి విడతలోనే మంచి కాలేజీలో సీటు సాధించడానికి అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లను ఎంచుకోవాలని కోరారు. ఆన్‌లైన్‌లో ఆప్షన్లు నమోదు చేసే ముందు, అభ్యర్థులు 'మాన్యువల్ ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్' పూర్తి చేసుకుని కాలేజ్ కోడ్, బ్రాంచ్ కోడ్‌లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. అధికారిక వెబ్‌సైట్ https://tgeapcet.nic.in లో కాలేజీల ప్రొఫైల్‌ను సరిచూసుకుని, ఆప్షన్లను ప్రాధాన్యత క్రమంలో అమర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.

Next Story