రైతుబంధు కాదు.. రాహుల్ బంధు

by Ratna Kumari |

రాష్ట్రంలో రైతులకు రైతుబంధు మాత్రం రావడం లేదని, రాహుల్ బంధు మాత్రం బాగా జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.

రైతుబంధు కాదు.. రాహుల్ బంధు
X

దిశ, ఖమ్మంబ్యూరో : రాష్ట్రంలో రైతులకు రైతుబంధు మాత్రం రావడం లేదని, రాహుల్ బంధు మాత్రం బాగా జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. బుధవారం సత్తుపల్లిలో స్పెషన్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై బూత్ లెవల్ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా ఒక్కటే మాట ‘కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అన్న నినాదం వినపడుతుందని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణలో రానున్న రోజుల్లో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పునాది రాళ్లు కార్యకర్తలే అన్న విషయం తెలుసని, భవిష్యత్ లో అందరికీ అందుబాటులో ఉండి కాపాడుకుంటామని కేటీఆర్ అన్నారు.

కేసీఆర్ అన్నట్లుగానే తెలంగాణ ఆగం..

తెలంగాణ సాధించిన తండ్రిగా కేసీఆర్ గత ఎన్నికల్లో అనేక వేదికల మీద మోసపోతే గోస పడతామని అప్రమత్తం చేశారని, మీరు అవకాశం ఇవ్వకపోతే విశ్రాంతి తీసుకుంటానని, మీరే ఆగమైపోతారని హెచ్చరించిన విషయం గుర్తుచేశారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో కేసీఆర్ ఎన్నో పదవులు అలంకరించారని రాష్ట్రానికి సీఎం అయ్యారని తెలిపిన కేటీఆర్.. ప్రధాన మంత్రి పదవి తప్ప అన్ని పదవులు అలంకరించారని, ప్రస్తుతం కేసీఆర్ నష్టపోయింది ఏమీ లేదన్నారు. కేసీఆర్ మాట పెడచెవిన పట్టినందుకు రాష్ట్ర ప్రజలు నష్టపోయారని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ వి అబద్ధపు హామీలు..

ఆనాడు రైతుల దగ్గర భూమిశిస్తు, నీటితీరువా, విద్యుత్ బిల్లుల పేరిట తోలు వలిచి బిల్లులు వసూలు చేశారని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దేశ చరిత్రలో రైతులకు పెట్టుబడి సహాయం చేయాలని భావించి 11 సార్లు రైతుబంధు ఇచ్చారని వెల్లడించారు.రైతుబంధు పేరిట 73 వేల కోట్లు కేసీఆర్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 73 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లివచ్చాడని తెలిపారు. గోదావరి నీటిని ఒడిసిపట్టాలని భావించి 7 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి 10 వేల కోట్ల రూపాయలు కేటాయించి, 8 వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఖర్చు చేసిందని వెల్లడించారు. మిగతా 2 కోట్ల రూపాయల పనులు పూర్తిచేయలేక జిల్లాకు చెందిన మంత్రులు చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. 50 వేల కోట్ల రూపాయలు అవసరమవుతుందని బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి 40 వేల కోట్లు చాలన్నారని, తిరిగి కేబినేట్ సమావేశంలో 31 వేల కోట్లు సరిపోతాయని, అసెంబ్లీకి వచ్చేలోపల 26 వేల కోట్ల రూపాయలు సరిపోతాయని చివరకు 20 వేల కోట్లు సరిపోతాయని తుమ్మల చెప్పారని రైతులను వంచించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధుకు రాంరాం చెబుతారని కేసీఆర్ ఆనాడే చెప్పారని, ఇప్పుడు ఏమైందని ఇప్పటికే మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలు మోసపోయాయని వెల్లడించారు. కేసీఆర్ ఉద్యోగం, కేటీఆర్ ఉద్యోగం తీసేస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న రేవంత్.. ఇప్పుడు ఏం చెబుతాడని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలకే కాగితాలిస్తున్నారని ధ్వజమెత్తారు. భట్టి విక్రమార్క ఇచ్చిన గ్యారెంటీ కార్డులకు సమాధానం చెప్పాలన్నారు. మూడు నెలల్లో మ్యాజిక్ చేస్తానన్న సీఎం 30 నెలలైనా చేయలేకపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పుకుంటా..

కోటి మంది మహిళలను సీఎం రేవంత్ రెడ్డి కోటీశ్వరులను చేస్తానన్నాడని, రాష్ట్రంలో ఉన్న 1.67 కోట్ల మంది మహిళలను కోటీశ్వరులను కాదు.. లక్షాధికారులను చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న మహిళలందరి బ్యాంకు ఖాతాలో లక్షన్నర రూపాయలు వేస్తే శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తానని చెప్పారు. కేసీఆర్ అప్పులు చేశాడని ఇక్కడి మంత్రుల సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, కేసీఆర్ చేసిన అప్పులు 2లక్షల 80 వేల కోట్లు మాత్రమేనని అది కూడా పదేళ్లలో చేశాడని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏండ్లలోనే 4.5 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు, రుణమాఫీ, సీతారామ ప్రాజెక్టు, కాళేశ్వరం, పాలమూరు,రంగారెడ్డి, విద్యుత్ సామర్థ్యం పెంపు, గురుకుల పాఠశాలల ఏర్పాటు, పెన్షన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్ల కోసం మాత్రమే కేసీఆర్ చేసిన అప్పులు చేశాడని తెలిపారు. రేవంత్ రెడ్డి చేసిన అప్పు దేనికోసమని ప్రశ్నించారు. బుగ్గపాడు ఫుడ్ పార్కులో 60 లక్షల ధర ఉంటే 21 లక్షలకే ఆంధ్రా కంపెనీకి కట్టబెట్టడం వెనుకున్న రహస్యమేంటని ప్రశ్నించారు. కేంద్రంలో, రాష్ట్రంలో దుర్మార్గమైన ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) విషయంలో జాగ్రత్తగా ఉండాలని బూత్ లెవల్ కార్యకర్తలకు సూచించారు. ఓటర్ లిస్టును వడపోసే కార్యక్రమం జరుగుతుందని, పార్టీకి చెందిన వారి ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలని సూచించారు.

తెలంగాణ ముష్కరులపాలైంది.. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

పుష్కర కాలం తర్వాత తెలంగాణ ముష్కరుల పాలైందని, రానున్న రెండు సంవత్సరాల్లో తెలంగాణ గడ్డపై గులాబీ జెండా ఎగురనున్నదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. అడిగిన వారిని సీఎం బెదిరింపులకు గురిచేస్తున్నాడని, చివరకు ఎస్ బీఐని కూడా బెదిరించసాగాడన్నారు. సీఎం బెదిరింపుల కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా భయపడుతున్నారని వెల్లడించారు. రియల్ ఎస్టేట్ రంగం రాష్ట్రంలో కుదేలైందని, అన్నివర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయని ధ్వజమెత్తారు. రాబోయే తరానికి ఉత్తమ నాయకుడు కేటీఆర్ అని, వినయ విధేయ రాముడే భవిష్యత్ తరానికి వారసుడని శ్రేణులను ఉత్తేజపరిచాడు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులున్నారు.

Next Story