మున్సిపాలిటీల్లో వసూలవని ప్రాపర్టీ టాక్స్!

by Muthe.Rajitha |

మున్సిపాలిటీల్లో ప్రాపర్టీ టాక్స్ నామమాత్రంగానే వసూలైందని అధికారులు చెబుతున్నారు.

మున్సిపాలిటీల్లో వసూలవని ప్రాపర్టీ టాక్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రధాన ఆదాయ వనరైన ఆస్తి పన్నుపై పురపాలకశాఖలోని కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) ఫోకస్ పెట్టింది. కానీ ఫలితాలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి ఈ నెలాఖరుకు 80 శాతం వసూలు కష్టమేనని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 50 శాతం ప్రాపర్టీ టాక్స్ వసూలైనట్టు అధికారులు చెబుతున్నారు. జమ్మికుంట, హుజురాబాద్ మాత్రం టాప్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో సీడీఎంఏ ఆదాయం భారీగా తగ్గిందనే చెప్పాలి. 27 మున్సిపాలిటీల్లోనే సుమారు రూ.500 కోట్లకుపైగా ప్రాపర్టీ టాక్స్ వచ్చేదని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో 133 యూఎల్బీలు

రాష్ట్రంలో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలను మినహాయిస్తే సీడీఎంఏ పరిధిలో 130 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. వీటిలో సుమారు 20 లక్షల అసెస్‌మెంట్స్ ఉన్నాయి. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీలో విలీనమైన 27 మున్సిపాలిటీలతో కలిపి రూ.1057 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. అయితే టార్గెట్ రూ.1500 కోట్లుగా పెట్టుకుంటే రూ.1057 వసూలు చేశారు.

50 శాతమే..

సీడీఎంఏ పరిధిలో గతేడాది కన్నా ప్రాపర్టీ టాక్స్ వసూళ్లు తగ్గనున్నాయి. అందుకు మున్సిపల్ ఎన్నికలు ఓ కారణమని అధికారులు చెబుతున్నారు. గతేడాది కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీల్లో 100 శాతం ఆస్తిపన్ను వసూలు చేశారు. ఈ సారి వీటిలో 100 శాతం అయ్యే అవకాశముంది. దీంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని నార్సింగ్, తుర్కఎంజాల్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలతో కలిపి 39 మున్సిపాలిటీల్లో 80 శాతానికిపైగా అయింది. కానీ వీటిని జీహెచ్ఎంసీలో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరు నాటికి 80 శాతం సైతం వసూలయ్యే అవకాశంలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఎర్లీబర్డ్‌లో గతేడాది రూ.400 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సారి ఇది తగ్గే అవకాశముందని సమాచారం.

సీడీఎంఏ హెడ్ ఆఫీసు నుంచి..

ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 11 రోజులు మిగిలి ఉంది. 11 రోజుల్లో టార్గెట్ చేరుకుంటారో? లేదో చూడాల్సిందే. అయితే ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయడానికి అధికారులకు సీడీఎంఏ హెడ్ ఆఫీసు నుంచి నిరంతరం ఆదేశాలు జారీ చేస్తున్నారు. సమీక్షలు, టెలీకాన్ఫరెన్స్‌తోపాటు రెగ్యులర్ ఫోన్ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశంలేదని పలువురు మున్సిపల్ కమిషనర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రోజుల ప్రణాళిక అమలు, మరో పక్క ప్రాపర్టీ టాక్స్ వసూళ్లపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

Next Story