- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్సీ, ఎస్టీ కేసుల బాధితులకు సత్వర న్యాయ సేవలు
జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి చర్యలు తీసుకోవడంతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసుల బాధితులకు సత్వర న్యాయ సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.

దిశ, మంచిర్యాల: జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి చర్యలు తీసుకోవడంతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసుల బాధితులకు సత్వర న్యాయ సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం నస్పూర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర సభ్యుడు రేణుకుంట్ల ప్రవీణ్, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి పలు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కేసుల బాధితులకు సత్వర న్యాయ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అట్రాసిటీ కేసుల్లో ఫిర్యాదుదారులు అందించిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టి, త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పౌర హక్కులపై అధికారులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో గంజాయి, ఇతర నిషేధిత మాదకద్రవ్యాల వినియోగంపై సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహించడంతో యువత మద్యానికి బానిసై పెడదారి పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులపై నిరంతర నిఘా ఉంచి వాటిని నియంత్రించే చర్యలు చేపట్టాలని సూచించారు. అంతకుముందు ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తుదారుల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, వి. రాములు, జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, జిల్లా రెవెన్యూ అధికారి మోతి రామ్, మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీలు కిరణ్ కుమార్, ప్రకాష్, వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






