- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబర్ నేరాల బాధితులకు సత్వర న్యాయం అందించాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు శాఖలో డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థలను మరింత బలోపేతం చేసి సైబర్ నేరాల బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు.

దిశ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు శాఖలో డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థలను మరింత బలోపేతం చేసి సైబర్ నేరాల బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా ఐటీ కోర్, సైబర్ సెల్ విభాగాలను సందర్శించిన ఆయన సీసీటీఎన్‌ఎస్, ఈ-సాక్ష్య, సీఈఐఆర్, నాట్‌గ్రిడ్ తదితర డిజిటల్ వ్యవస్థల పనితీరు, పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, సమాచార నమోదు ప్రక్రియను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించడం, బ్లాక్ చేయడం, రికవరీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే నాట్‌గ్రిడ్, గాండీవా వ్యవస్థల ద్వారా సమాచార విశ్లేషణ చేసి నేరాల నియంత్రణ, దర్యాప్తులో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.
సైబర్ నేరాల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితుల నుంచి మోసపోయిన డబ్బు రికవరీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీ స్పష్టం చేశారు. జీఆర్ఎం, ఎంఆర్ఎం, సమన్వయ, సహాయోగ్ పోర్టళ్లను సమర్థంగా వినియోగించాలని సూచించారు. డిజిటల్ అరెస్టులు, సైబర్ మోసాలపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అవసరమైన కేసుల్లో బీఎన్‌ఎస్ సెక్షన్-111ను అమలు చేయాలని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది నిరంతరం సాంకేతిక శిక్షణ పొందుతూ సైబర్ నేరాల నియంత్రణలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. డేటా భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ అధికారిక సమాచారాన్ని గోప్యంగా భద్రపరచాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించాలని ఎస్పీ రోహిత్ రాజ్ పేర్కొన్నారు. ఈ సమీక్షలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, సైబర్ సెల్ సీఐ జితేందర్, ఐటీ కోర్ ఎస్సై గణేష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






