అప్పులు పెరుగుతున్నా హామీలు అమలు కావడం లేదు : మాజీ ఎమ్మెల్యే

by Batti.Sumithra |

రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తున్నప్పటికీ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ విమర్శించారు.

అప్పులు పెరుగుతున్నా హామీలు అమలు కావడం లేదు : మాజీ ఎమ్మెల్యే
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తున్నప్పటికీ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఎటు వెళ్తున్నాయో ప్రజలకు స్పష్టంగా వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో అప్పులు చేసినప్పటికీ, వాటిని సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగించామని ఆయన తెలిపారు. రైతు బంధు పథకం ద్వారా 11 దఫాల్లో సుమారు రూ.73 వేల కోట్ల పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని పేర్కొన్నారు. అలాగే ప్రతి జిల్లాలో కొత్త కలెక్టరేట్ భవనాలు, ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని గుర్తుచేశారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల మరమ్మతులు చేపట్టేందుకు సంబంధిత కాంట్రాక్టర్ ముందుకు వచ్చినప్పటికీ, రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.

ఇది తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను విస్మరించడమేనని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై కూడా ఆయన స్పందించారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి పోలింగ్ బూత్‌లో పార్టీ బూత్ ఏజెంట్లు బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓలు)తో కలిసి ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులను నిశితంగా పరిశీలించాలని సూచించారు. డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారి పేర్లు ఓటరు జాబితాలో కొనసాగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అయూబ్ పాషా, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రామ్ సింగ్, ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Next Story