పుష్కరాల నాటికి కోటిలింగాలకు కొత్త శోభ

by Batti.Sumithra |

గోదావరి పుష్కరాలకు ముందే చారిత్రక పుణ్యక్షేత్రమైన కోటిలింగాలకు కొత్త శోభను తీసుకురానున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

పుష్కరాల నాటికి కోటిలింగాలకు కొత్త శోభ
X

దిశ, వెల్గటూర్ : గోదావరి పుష్కరాలకు ముందే చారిత్రక పుణ్యక్షేత్రమైన కోటిలింగాలకు కొత్త శోభను తీసుకురానున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. అలాగే గోదావరి తీరం వెంబడి బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాలను పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుందరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి పనులను వేగవంతం చేస్తోందని అన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలోని శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి పుష్కరాలకు ఏడాది ముందుగానే ఏర్పాట్లు చేపట్టేందుకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించడం విశేషమని పేర్కొన్నారు.

గోదావరి తీరం వెంట బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంతో పాటు, కోటిలింగాలలోని శ్రీ కోటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ధర్మపురి నియోజకవర్గంలో పుష్కర పనుల కోసం మొత్తం రూ.117 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో కోటిలింగాల పుష్కర ఘాట్ నిర్మాణానికి రూ.8 కోట్లు, కోటిలింగాల నుంచి పాశీగాం వరకు రహదారి నిర్మాణానికి రూ.8 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ధర్మపురి ఉగ్ర నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు, వెల్గటూర్ నుంచి కోటిలింగాల వరకు నాలుగు లైన్ల రహదారి విస్తరణకు రూ.20 కోట్లు కేటాయించినట్లు వివరించారు. అలాగే కోటిలింగాలతో పాటు రాజక్కపల్లి వద్ద మినీ ట్యాంక్‌బండ్ తరహాలో నిర్మాణం చేపడతామని తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత..

కోటిలింగాల గ్రామానికి చెందిన మంచికట్ల మణితేజ ఇటీవల కుక్కకాటుకు గురై మృతిచెందగా, ఆయన కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

గృహప్రవేశంలో పాల్గొన్న మంత్రి..

వెల్గటూర్ మండల కేంద్రానికి చెందిన సింగం రాజేశ్వరి–తిరుపతి దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, దినేష్, ఏవో కాంతారెడ్డి, చైర్మన్ పూదరి రమేష్, తిరుపతి శైలేందర్ రెడ్డి, శ్రీకాంత్ రావు, మురళి, ఉదయ్, మెరుగు నరేష్, సందీప్ రెడ్డి, గుమ్ముల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story